ప్రపంచాన్నిఅతలాకుతలం చేస్తున్న చేస్తున్న కొవిడ్ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ లో తయారైందన్న ఆరోపణలు, అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. గత ఏడాది కొవిడ్ -19 వ్యాప్తి మొదలుకాకముందే వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురికావడం, ఆ విషయాన్ని చైనా రహస్యంగా ఉంచిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ సమన్వయంతో ఓ టీం వెళ్లి పరిశోధనలు చేసేందుకు ప్రయత్నించినా చైనా ప్రభుత్వం సహకరించలేదు. చైనా వ్యవహారశైలిపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలకు పలుమార్లు వెన్నుపోట్లు పొడిచిన చైనా ఇప్పుడు అలాంటి ఘటనతోనే వణుకుతోందని చెప్పవచ్చు.
ఇదీ కారణం..
చైనా ప్రభుత్వంలో మంత్రి హోదాలో కీలకగా ఉన్న వ్యక్తి కొన్నాళ్లుగా చైనాలో కనిపించడం లేదు. సదరు వ్యక్తికి చైనాలోని గూఢచార, నిఘా వ్యవస్థలతోపాటు వూహాన్ ల్యాబ్ తో సంబంధాలూ ఉన్నాయి. ఈ వ్యక్తి కనిపించకపోవడంతోపాటు అమెరికాకు వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా ఉలిక్కిపడింది. పరోక్షంగా పలు ప్రకటనలూ చేసింది. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ-వైస్ మినిస్టర్ గా పనిచేస్తున్న డాంగ్ జింగ్ వెయ్ చైనా నిఘా, గూఢచర్య విభాగంలో కీలకంగా ఉన్నారు. చైనాకు సహాయకారిగా ఉండడంతోపాటు కౌంటర్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టే గువాన్‌బు అనే సంస్థకు 2018 నుంచి నేతృత్వం వహిస్తున్నారు. కొంత కాలం నుంచి ఈయన కనిపించడం లేదంటూ స్థానికంగా వార్తలు వచ్చాయి. అయితే తమ దేశంలోని విషయాలను రహస్యంగా ఉంచే చైనా ఈ విషయాన్నికూడా బయటకు చెప్పలేదు. తరువాతి క్రమంలో ఆయన అమెరికాకు పరారైనట్లు వార్తలూ వచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న మాజీ విదేశాంగ శాఖ అధికారి హన్ లియాంచావో చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అయితే చైనా పలుమార్లు ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం, తరువాత అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించడం కూడా జరిగిన నేపథ్యంలో ఈ వార్త నిజమైందా కాదా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశాలు నిజమైతై చైనాకు చరిత్రలో ఇది గట్టి ఎదురుదెబ్బగా భావించవచ్చని పలు మాధ్యమాల్లో కథనాలూ వచ్చాయి.
డాంగ్ అప్పగింతకు అమెరికా నో?
అయితే డాంగ్ జింగ్ వెయ్ ను తమకు అప్పగించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అమెరికాను కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్, జాతీయ భద్రత సలహాదారు జాక్ సలైవాన్‌ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరగా అమెరికా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ‘అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (డీఐఏ) అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి స్పై టాక్, రెడ్ స్టేట్ లాంటి ఇన్వెస్టిగేషన్ పత్రికలు రాసిన కథనాలే ప్రామాణికాలుగా ప్రచారం జరుగుతోంది.
ఆందోళనలు.. అనుమానాలు..
అయితే డాంగ్ జింగ్ వెయ్ అమెరికాకు చిక్కితే చైనా నిఘా రహస్యాలు, ఆయుధ వ్యవస్థలు, పీపుల్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాలు, క్షిపణి రహస్యాలతోపాటు వైమానిక దళ రహస్యాలూ కొన్ని వెల్లడవుతాయని, అన్నిటికీ మించి కొవిడ్ విషయాలు వెలుగులోకి వస్తాయని, అమెరికాలో ఉన్న చైనా గూఢచారులకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డాంగ్ జింగ్ వెయ్ సాధారణంగా వెళ్లారా లేక సమాచారాన్ని కూడా తీసుకెళ్లారా అనే అంశంపైనా చర్చ నడుస్తోంది. కాగా జూన్ 18న డాంగ్ ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ సదస్సు (సింపోజియం)లో పాల్గొన్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న వార్తా వెబ్‌సైట్ ఓ కథనాన్ని రాసింది. అంతేకాకుండా చైనా వేగుల్లో కొందరు ప్రత్యర్థులతో చేతులు కలిపి నమ్మకద్రోహానికి పాల్పడే ఆలోచనలతో ఉన్నారని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్వయంగా డాంగ్ వ్యాఖ్యానించినట్టు ఆ పత్రిక పేర్కొంది.
Must Read ;- కరోనా వైరస్ చైనా సృష్టించిందే.. పరిశోధనాత్మక విశ్లేషణ