తెలంగాణలో థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ఇప్పట్లో పెద్ద సినిమాలు వచ్చేలా లేవు. ఆగస్ట్ వస్తే తప్ప
పెద్ద, మీడియం-రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రావనే టాక్ ఉంది. మూడో వేవ్ వస్తుందనే భయం వీళ్లందరి సినిమాల్ని అబేయన్స్ లో పడేసింది. ఓవైపు అంచనాలు, అయోమయాలు ఇలా కొనసాగుతుండగా.. మరోవైపు ఓటీటీ బేరాలు మాత్రం ఆగడం లేదు. క్రేజీ ప్రాజెక్టు దొరికితే ఓటీటీ సంస్థలు భారీగానే ఆఫర్ చేస్తున్నాయి. మంచి ఎమౌంట్ తో ఊరిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఆఫరే నితిన్ నటించిన అంథాధున్ సినిమాకు వచ్చింది.
నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మ్యాస్ట్రో. కరోనా కేసులు తగ్గిన వెంటనే సెట్స్ పైకి వచ్చిన మొదటి సినిమా ఇది. ఆఘమేఘాల మీద నితిన్ ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశాడు. ఎందుకంత తొందరపడ్డాడో తాజాగా అందరికీ అర్థమైంది. సినిమా షూటింగ్ పూర్తయింది. తమన్న, నితిన్ పై తీసిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. మరో 10 రోజుల్లో ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడీ సినిమాకు ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. మేకర్స్ కూడా సినిమాను డైరక్ట్ ఓటీటీకి ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇది నితిన్ సొంత సినిమా. కాబట్టి దీన్ని డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇవ్వాలా లేక థియేటర్లలో రిలీజ్ చేయాలా అనే నిర్ణయం పూర్తిగా అతడి మీదే ఆధారపడి ఉంది. ఇంతకుముందు నితిన్ నటించిన రంగ్ దే సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద వస్తుందని అంతా అనుకున్నారు. అప్పట్లో నిర్మాత ఆ దిశగా ఆలోచించాడు కూడా. కానీ నితిన్ అంగీకరించలేదంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు మ్యాస్ట్రో విషయంలో నితిన్ కు ఆ సమస్య లేదు. ఆఫర్ బాగుంటే ఓకే చెప్పొచ్చు.
ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. సినిమా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉంటుంది. తమన్న లేడీ విలన్. హిందీలో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ ఇది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంపై రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే నితిన్ దీన్ని నేరుగా ఓటీటీకి ఇచ్చేయొచ్చు. ఏదైతే అదే అయిందనుకుంటే థియేట్రికల్ రిలీజ్ వరకు ఎదురు చూడొచ్చు.
కానీ ఈమధ్య నితిన్ చేసిన ప్రయోగం ఒకటి భారీగా వికటించింది. అదే చెక్. ఈ సినిమాలో ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో కనిపించాడు నితిన్. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ చెక్ సినిమా నితిన్ కు షాక్ ఇచ్చింది. సో.. మ్యాస్ట్రో సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలనే నితిన్ ఆలోచన వెనక చెక్ సినిమా ప్రభావం కూడా ఉందనేది కాదనలేని వాస్తవం.
ఇక సినిమా విషయానికొస్తే.. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఇప్పటికే నితిన్ లుక్ రిలీజైంది. ఆల్రెడీ రిలీజైన కొన్ని పోస్టర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా నితిన్-నభా నటేష్ కు సంబంధించి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
Must Read ;- నితిన్ సరసన కథానాయికగా రౌడీ బేబీ?