ఏపీలో విపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీలో ఈ వార్త పెను కలవరాన్నే రేపుతున్నాయని చెప్పాలి. పార్టీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ రాజీనామా చేయనున్నట్లుగా వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. పార్టీ అధిష్ఠానంపై చాలా కాలం నుంచి గోరంట్ల అసంతృప్తితోనే ఉన్నారన్న వాదనలు లేకపోలేదు. అయితే టీడీపీ ప్రారంభం నుంచి.. అంటే 1982లో పార్టీలో చేరిన గోరంట్ల పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కినా, దక్కకపోయినా కూడా ఏనాడూ మాట మాత్రంగా కూడా తన అసంతృప్తిని గోరంట్ల వెళ్లగక్కిన దాఖలా లేదు. పార్టీకి నమ్మినబంటుగా, పార్టీ పరువును పెంచే దిశగా సాగిన గోరంట్ల.. తెలుగు నేల ఉమ్మడిగా ఉన్నంత కాలం పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేయలేదనే చెప్పాలి. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎం కాగానే.. ఆయన కేబినెట్ లో తనకు బెర్త్ ఖాయమని గోరంట్ల భావించారు. అయితే సామాజిక సమీకరణాలు, ఆయా జిల్లాల ప్రాధాన్యం దృష్ట్యా గోరంట్లకు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదనే చెప్పాలి.
అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు
ఈ క్రమంలో గత కొంతకాలంగా పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న గోరంట్ల..గురువారం నాడు తన మనసులోని మాటను బయటపెట్టారు. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పార్టీ టికెట్ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే దిశగా గోరంట్ల సాగుతున్నట్లుగా కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా గోరంట్ల ఏమీ మీడియా ముందుకు రాలేదు గానీ.. ఆయన సన్నిహితులు, విశ్వసనీయ వర్గాల పేరు చెప్పి పలు మీడియా సంస్థలు గోరంట్ల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లుగా కథనాలు ప్రసారం చేశాయి. అంతేకాకుండా పార్టీ అధిష్ఠానం తనలాంటి సీనియర్ల సేవలను అసలు గుర్తించడం లేదని కూడా గోరంట్ల ఫైర్ అవుతున్నట్లుగా ఈ కథనాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా తనలాంటి సీనియర్ల ఫోన్లను కూడా లిఫ్ట్ చేయడం లేదని గోరంట్ల మదనపడుతున్నారట. ఈ కారణంగానే తాను పార్టీకి, పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేయాలనుకుంటున్నానని.. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ దిశగా నిర్ణయం ప్రకటిస్తానని కూడా గోరంట్ల చెబుతున్నట్లుగా ఆ వార్తలు పేర్కొంటున్నాయి. మొత్తంగా గోరంట్ల రాజీనామా పేరిట వినిపిస్తున్న వార్తలు ఏపీలో పెను కలకలం రేపుతున్నాయి.
బుజ్జగిస్తే తగ్గుతారా?
ఇలాంటి నేపథ్యంలో మరికొన్ని కథనాల ప్రకారం పార్టీ హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న గోరంట్లకు చంద్రబాబు, లోకేశ్ ఫోన్ చేయడమో, లేదంటే.. నేరుగా వెళ్లి బుజ్జగించడమో చేస్తే పరిస్థితి చక్కబడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో అప్పుడప్పుడు ఇలాంటి పరిణామాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేయడం ఇదివరకు కూడా జరిగిందని, ఇప్పుడు కూడా పార్టీ అధిష్ఠానం తక్షణమే స్పందిస్తే.. గోరంట్ల పార్టీకి దూరంగా జరిగే పరిస్థితే లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆది నుంచి టీడీపీతోనే సాగిన గోరంట్ల ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసినా.. ఏ పార్టీలో చేరకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాస్తంత ముక్కుసూటి మనిషిగానే పేరు పడిన గోరంట్ల ఇప్పుడున్న పార్టీల్లో ఇమడలేరని, ఆయనకు టీడీపీ తప్పించి వేరే ఏ పార్టీ కూడా సూట్ కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- దోపిడీలో వైసీపీ ఇలా బుక్కైపోయింది