అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పూజా ఎంటర్ టైన్మెంట్, ఎమ్మీ ఎంటైర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి రంజిత్ ఎం. తివారి దర్శకత్వం వహించారు. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందిన కథ ఇది. 1970, 80 దశకాల్లో విమానాల హైజాక్ ఘటనలు చాలా జరిగాయి. అలాంటి ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తెరకెక్కించారు. రా ఏజంట్ అన్షుల్ (అక్షయ్ కుమార్) తన విధి నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. హైజాకర్ల కారణంగానే అతని తల్లి ప్రాణాలు కోల్పోతుంది. ఆమె ఆస్తమా రోగి. భారతీయ విమానాన్ని పాక్ హైజాకర్లు హైజాక్ చేయడం వల్ల ఊపిరందక ఆమె ప్రాణాలు కోల్పోతుంది. అహ్లూవాలియా ఈ పాత్రను పోషించింది. హైజాకర్ల ఆట కట్టించడంలో ఆతని నైపుణ్యమే వేరు.
హైజాక్ కు విమానం గురైందంటే అతన్నే సంప్రదిస్తారు. ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావడంలో అతని బృందం కీలక పాత్ర పోషిస్తుంది. అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించింది. ఆమె పాత్ర విషయంలో మంచి ట్విస్ట్ ఉంది. అదేమిటన్నది తెర మీద చూడాల్సిందే. హైజాక్ కు గురై అమృత్ సర్ లో ల్యాండ్ అయిన విమానంలో 210 మంది ప్రయాణికులు ఉంటారు. హైజాకర్లను మట్టుబెట్టడానికి జరిగన రహస్య ఆపరేషన్ ఈ సినిమాకి ప్రధాన ఆయువు పట్టు. ఇలాంటి కథలన్నీ సుఖాంతమయ్యేవే. కానీ ఆ ఉత్కంఠకు హీరో ఎలా తెరదించుతాడన్నదే ఇందులోని ప్రధాన అంశం.
ఎలా తీశారు? ఎలా చేశారు?
అక్షయ్ కుమార్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇంత వయసులోనూ తన స్టామినా ఏమాత్రమూ తగ్గలేదని నిరూపించారు. అతని భార్య పాత్రను వాణికపూర్ పోషించింది. మరో కీలకమైన పాత్ర లారా దత్తాది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను ఆమె పోషించింది. అచ్చుగుద్ది నట్టు ఆమెను ఇందిరా గాంధీలానే మేకప్ మెన్ తీర్చిదిద్దాడు. హైజాకర్ల బారి నుంచి ప్రయాణికులను రక్షించే విషయంలో అక్షయ్ కు తోడ్పాటు నందించే పాత్రలను ఆదిల్ హుస్సేన్, హ్యుమా ఖురేషి పోషించారు. ప్రధానంగా 1970, 1980లలో సాగిన రెండు విమాన హైజాక్ ఘటనలను తీసుకుని ఈ సినిమాని రూపొందించారు.
ఈ విషయంలో దర్శకుడు రంజిత్ తివారి ప్రతిభను మెచ్చుకోవలసిందే. ఉత్కంఠను కొనసాగించడంలో ఎక్కువ మార్కులు అతనికే పడతాయి. ఇలాంటి కథలకు పాటల అవసరం ఉండదు. కానీ ఇందులో గురుద్వారా పాట, ధూమ్ తారా అనే టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలిచాయి. సినిమా చూస్తున్నంత సేపూ సన్నివేశాలు మనల్ని వెంటాడుతాయి. కథనంలో ఎక్కడా దర్శకుడి పట్టు సడల లేదు.
కాకపోతే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్దపెట్టి ఉంటే బాగుండేది. ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీశారు. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. 1980లో సాగే కథనం కావడంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ప్రారంభం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కచ్చితంగా థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా.
నటీనటులు : అక్షయ్ కుమార్, వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా, ఆదిల్ హుస్సేన్, డాలీ అహ్లువాలియా, జైన్ ఖాన్ దురానీ తదితరులు.
సాంకేతికవర్గం: రచన: అసిల్ అరోరా, ఫర్వేజ్ ఖాన్, కెమెరా: రాజీవ్ రవి, ఎడిటింగ్: చంద్ర అరోరా, నేపథ్యం సంగీతం: డేనియల్ బి. జార్జ్.
నిర్మాతలు: విష్ణు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్సికా దేశ్ ముఖ్, మోనిషా అద్వానీ, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ
దర్శకత్వం: రంజిత్ ఎం. తివారీ
విడుదల: 19-08-2021
ఒక్క మాటలో: థియేటర్లలోనే చూడాలి.
రేటింగ్: 3/5