కొన్ని తప్పులు తెలిసి చేస్తుంటాం. మరికొన్ని తప్పులు మనకు తెలియకుండానే.. మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. తెలిసి చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడాలన్న దానిపై ఓ మోస్తరు అవగాహన ఉన్నా.. తెలియకుండానే జరిగిపోయిన తప్పుల నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. వెరసి ఈ రెండో రకం తప్పులు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పాలి. ఇలాంటి ఓ వివాదంలోనే టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు సిద్ధార్థ్ చిక్కుకుపోయారు. మరి ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.
బుల్లెట్ ఎలా వచ్చిందో?
పరిటాల ఫ్యామిలీ రాజకీయ వారసుడిగా పరిటాల శ్రీరామ్ ఇప్పటికే రాజకీయాల్లో యమా యాక్టివ్ గా ఉన్నారు. అదే సమయంలో పరిటాల కూతురు భర్త కూడా రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. అయితే పరిటాల చిన్న కుమారుడు సిద్ధార్ధ్ మాత్రం ఇప్పటిదాకా అసలు రాజకీయ వాసనలే లేకుండా సాగుతున్నారు. విద్యాధికుడైన సిద్ధార్థ్ ను రాజకీయాలకు దూరంగా ఉంచేలా శ్రీరామ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి టూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ పోలీసులకు చిక్కిపోయారు. సిద్ధార్థ్ బ్యాగులో 5.56 క్యాలిబర్ పిస్టల్ లో వినియోగించే ఓ బుల్లెట్ దొరకడంతో ఆయనను పోలీసులు నిలిపేశారు. ఆ బుల్లెట్ తన బ్యాగులోకి ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని సిద్ధార్థ్ చెబుతున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న ఫ్యామిలీకి చెందిన వాడు కావడంతో సిద్ధార్థ్ కు ఇప్పటికే .32 క్యాలిబర్ పిస్టల్ వినియోగించేందుకు లైసెన్స్ ఉంది. ఆయన బ్యాగ్ లో దొరికిన బుల్లెల్ ఆ పిస్టల్ వాడేదే అయితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే అది 5.56 క్యాలిబర్ పిస్టల్ లో వినియోగించేది కావడంతో సిద్ధార్థ్ బుక్కైపోయాడు. అసలు ఈ బుల్లెట్ తన బ్యాగ్ లోకి ఎలా వచ్చి చేరిందన్న విషయం సిద్ధార్థ్ కు కూడా తెలియదట. ఇదే విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఆ బుల్లెట్ మీ బ్యాగులోకి ఎలా వచ్చిందన్న విషయం చెబితే వదిలేస్తామన్న దిశగా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారట.
ఎవరిదై ఉంటుంది?
పరిటాల సిద్ధార్థ్ ఫ్రెండ్ సర్కిల్ పెద్దదిగానే తెలుస్తోంది. తన జిల్లాతో పాటు తనతో పాటు కలిసి చదువుకున్న చాలా మందితోనే ఆయనకు స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆయన ఫ్రెండ్ సర్కిల్ లోని ఓ వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నారట. సిద్ధార్థ్ బ్యాగ్ లో దొరికిన బుల్లెట్.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (సైన్యంలో ఒక విభాగం)లో పని చేస్తున్న ఒక సైనికుడిదని పోలీసులు నిర్ధారించినట్లుగా చెబుతున్నారు. ఆ సైనికుడు సిద్ధార్థ్ స్నేహ బృందంలోని వారేనా అన్న దిశగానూ విచారణ జరుగుతోందట. తనకు తెలియకుండానే తన బ్యాగ్ లో బుల్లెట్ దొరికిన నేపథ్యంలో ఫ్రెండ్స్ తో కలిసి జరిపే ట్రిప్ ను రద్దు చేసుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ఎయిర్ పోర్టు పోలీసులు కొనసాగిస్తున్న విచారణకు కూడా హాజరు కాక తప్పడం లేదు. మొత్తంగా తన బ్యాగులోకి వచ్చి చేరిన బుల్లెట్ వల్ల పరిటాల సిద్ధార్థ్ ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా.. ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడతారోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
Must Read ;- నిజమా.. తెలంగాణలో తాలిబాన్ సపోర్టున్నారా?










