కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి.. నిజంగానే ప్రజలు మెచ్చిన నేత. ఎంత ఎత్తుకు ఎదిగినా.. తనను రాజకీయంగా నిలబెట్టిన వారిని గుర్తు చేసుకుని ఆయన బాధ పడిన తీరు నిజంగానే ఆయనను సిసలైన ప్రజా నేతగా నిలబెట్టిందని చెప్పాలి. పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టినప్పుడే.. కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న కిషన్ రెడ్డి.. రెండున్నరేళ్లు తిరక్కుండానే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని సూచన మేరకు తెలుగు రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రను సాగిస్తున్న కిషన్ రెడ్డి.. శనివారం తనను రాజకీయంగా జన్మనిచ్చిన అంబర్ పేటకు వచ్చారు. ఈ సందర్భంగా తన మూలాలను గుర్తు చేసుకుని.. తనను రాజకీయంగా నిలబెట్టిన, రాజకీయంగా తన ఎదుగుదలకు కారణమైన అంబర్ పేట ప్రజలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా అందరు నేతల్లో నుంచి రావనే చెప్పాలి. కిషన్ రెడ్డి మాదిరిగా సిసలైన రాజకీయం చేసే నేత నుంచే ఈ తరహా వ్యాఖ్యలు వస్తాయని చెప్పాలి.
కిషన్ రెడ్డి ప్రస్థానమిదే
1960లో జన్మించిన కిషన్ రెడ్డి.. 17 ఏళ్ల వయసులోనే 1977లో జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 1980లో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీలో చేరిపోయిన రెడ్డి.. పార్టీలో ఫుల్ టైం మెంబర్ గా సేవలు అందించడం మొదలెట్టారు. పార్టీ యువజన విభాగం యువ మోర్చాలో పలు కీలక పదవులు చేపట్టిన కిషన్ రెడ్డి.. 2004 ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యేగా కొత్త ప్రస్థానం మొదలెట్టారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న ఆ సమయంలో హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విక్టరీ కొట్టేశారు. 2009లో ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరగ్గా.. హిమాయత్ నగర్ అదృశ్యమైపోయి.. కొత్తగా అంబర్ పేట పేరిట నియోజకవర్గం ఏర్పడింది. హిమాయత్ నగర్ అసెంబ్లీ పరిధిలోని మెజారిటీ ప్రాంతాలు అంబర్ పేటలో చేరిపోయాయి. దీంతో 2009 ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగారు. అక్కడ విజయం దక్కించుకున్న కిషన్ రెడ్డి.. 2014 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా వరుసగా మూడో విక్టరీ కొట్టారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్ది గెలుపు ఖాయమనే అనుకున్నా.. ఆయన కేవలం 1,016 ఓట్లతో ఓడిపోయారు. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మళ్లీ విక్టరీ కొట్టారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం, ఆ తర్వాత ఏకంగా కేబినెట్ ర్యాంకు దక్కడం తెలిసిందే.
సంతోషం కన్నా బాధే ఎక్కువంట
కిషన్ రెడ్డి ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. అంబర్ పేటతో ఆయనది విడదీయలేని బంధమనే చెప్పాలి. హిమాయత్ నగర్ అయినా, ఆ తర్వాత పేరు మారి అంబర్ పేట అయినా.. కిషన్ రెడ్డికి ప్రతి గల్లీ తెలుసనే చెప్పాలి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గం పరిధిలో గల్లీ గల్లీ తిరిగే కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించేవారు. ఈ కారణంగానే ఆయన అంటే అంబర్ పేట ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తారు. అందుకే ఆయన అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు విక్టరీ కొట్టారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయో, ఏమో తెలియదు గానీ.. తన జన ఆశీర్వాద యాత్ర అంబర్ పేటలోకి ప్రవేశించగానే కిషన్ రెడ్డి ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగానే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘కేంద్రమంత్రిగా ఉన్నా సంతోషం లేదు. అంబర్ పేట ప్రజలకు దూరమైనందుకు బాధగా ఉంది. కేంద్ర మంత్రిని చేసిన ఘనత అంబర్ పేట ప్రజలదే. నేను ఎదిగిన ఈ స్థాయికి అంబర్ పేట ప్రజలే కారణం. ఇప్పటికీ అంబర్ పేటలోని ప్రతి గల్లీ తిరగాలని ఉంది. అయితే అంబర్ పేట ప్రజల దీవెనల వల్ల కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది’’ అని కిషన్ రెడ్డి తనదైన శైలి భావోద్వేగానికి లోనయ్యారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు విన్న అంబర్ పేట ప్రజల సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.
Must Read ;- నిజమా.. తెలంగాణలో తాలిబాన్ సపోర్టున్నారా?











