బుచ్చిబాబు దర్శకుడిగా ‘ఉప్పెన‘ సినిమా రూపొందింది. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎక్కడా ఏ విషయంలోనూ పొంతనలేని ఒక అబ్బాయి .. అమ్మాయి మధ్య ప్రేమ మొలకలు వేయడం .. వాటిని విరిచేయడానికి విలన్ ప్రయత్నించడమే ఈ కథ. అయితే దర్శకుడిగా బుచ్చిబాబు ఎంచుకున్న నేపథ్యం వేరు .. దాని ట్రీట్మెంట్ వేరు. ఈ సినిమా గురించి యూత్ అంతా మాట్లాడుకునేలా చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు.
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు. ఈ కథను నేను చాలాకాలం క్రితమే తయారు చేసుకున్నాను. కథను రెడీ చేసుకుంటున్నప్పుడు .. విజయ్ దేవరకొండతో చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయనకి ఈ కథ సెట్ అవుతుందని భావించాను. కానీ ఈ కథను పట్టాలెక్కించే సమయం వచ్చేసరికి, విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. అలాంటప్పుడు ఆయన ఈ పాత్రకి సెట్ కాడు. అందువలన కొత్త కథానాయకుడిని తీసుకోవాలనుకున్నాను.
వైష్ణవ్ తేజ్ ను చూడగానే .. ఆయన కళ్లు ప్రత్యేకంగా అనిపించాయి. ఆయన అయితే ఈ కథకు సరిగ్గా సరిపోతాడని అనిపించింది. కథ నచ్చడంతో ఆయన కూడా ఓకే అన్నాడు. ఆ తరువాత మరే హీరోను అనుకోలేదు .. కలవలేదు కూడా. ఈ సినిమా చూసిన తరువాత వైష్ణవ్ తేజ్ విషయంలో నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. కొత్త హీరోలా కాకుండా చాలా సహజంగా ఆ పాత్రను పండించాడు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
Must Read ;- స్టార్ హీరోతో ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ మూవీ











