మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ ను తెరపరిచయం చేస్తూ రూపొందించిన సినిమా ‘ఉప్పెన’. ఇందులో కృతి శెట్టి కథానాయిక. మరో కీలక పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది. మెగా కుటుంబంలో హీరోకి ఈ తొలి సినిమా ఎలంటి మార్గనిర్దేశం చేసింది లాంటి విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందే ఈ ప్రేమ కథా చిత్రం విడుదలైంది. మరి యువతకు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.
కథలోకి వెళితే..
ప్రేమకూ పరువుకూ ఉన్న సంబంధం ఈనాటిది కాదు. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. కాకపోతే పరువు హత్యకు బదులు ఓ ప్రేమికుడి మగతనానికి ప్రశ్నగా నిలిచే కథ ఇది. అలాంటి పరువుకు ప్రాణమిచ్చే వ్యక్తి కోటగిరి శేషా రాయనం (విజయ్ సేతుపతి) ఒక్కగానొక్క కూతురు ప్రేమలో పడితే పర్యవసానం ఎలాంటిదన్నదే కథ. ఒకవిధంగా చెప్పాలంటే ఇది పాతకథే.. కాకపోతే కొత్తగా మలిచారు. రాయనం కూతురు బేబమ్మ (కృతిశెట్టి)కి ఆశి (వైష్ణవ్ తేజ్) మగతనం బాగా నచ్చింది. ఆసి కూడా ఆమెను తన చిన్నప్పటి నుంచే ప్రేమిస్తుంటాడు. అతను జాలరి జాలయ్య (సాయిచంద్) కుమారుడు.
తన కులం కాని వ్యక్తి, పేదింటి యువకుడైన ఆశిని తన కూతురు ప్రేమించిందని తెలిసి రాయనం ఎలా ప్రతిస్పందించాడు అన్న అంశం మీదే కథ ముందుకు సాగుతుంది. తమ ప్రేమ వ్యవహారం బయటపడటంతో ఈ ప్రేమ జంట ఊరి నుంచి వెళ్లిపోతారు. పరువుకు ప్రాణమిచ్చే రాయనం తన కూతురు ఇంట్లోనే ఉందనే నమ్మిచే ప్రయ్నత్నం చేస్తాడు. ఈ ప్రేమ కథకు శృంగార పరమైన అంశాన్ని జోడించి చెప్పడం కొంత జుగుప్స కలిగిస్తుంది కూడా. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది తెరమీద చూడాల్సిందే.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ముందుగా ఆశి పాత్ర పోషించిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి చెప్పుకోవాలి. అనుభవమున్న నటుడిలా మెప్పించాడు వైష్ణవ్. ఈ పాత్రకు తగ్గ ఫ్రెష్ లుక్ కనిపించింది అతనిలో. కానీ మొదటి సినిమాలోనే ఓ మగతనానికి పరీక్ష పెట్టే పాత్రను అతను పోషించడం హీరోగా అతనికి మాత్రం పరీక్షేనని చెప్పాలి. తొలి సినిమాలోనే ఇలాంటి పాత్రను ఎంచుకున్నాడేమిటా అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది కూడా. ఇక సంగీత పాత్రను కృతిశెట్టి పోషించింది. ముద్దు పేరు బేబమ్మగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం కృతిశెట్టి అనే చెప్పాలి.
సినిమాలో ఆమె అభినయం, హావభావాలు ఆమెను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ లలో కనిపించిన దానికి మించి ఆమె మెప్పించింది. చిన్న వయసులో ఇంత పరిణతి కనబర్చిన నటిగా గుర్తింపు మాత్రం ఉంటుంది. ముఖ్యంగా ఆమె మొహంలోని తెలుగుదనం ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకువచ్చేలా చేసింది. ఇక రాయనం పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ముఖంలో సీరియస్ నెస్ చూస్తేనే పాత్ర స్వభావాన్ని ఆయన ఎంతగా ఆకళింపు చేసుకున్నారన్నది అర్ధమవుతుంది. విజయ్ సేతుపతిలోని పరిపూర్ణమైన నటుడిని ఈ ఉప్పెన ఆవిష్కరించింది. కొన్ని పాత్రల ప్రయోజనం ఏమిటో కూడా అర్థం కాదు. హీరోకి మేనరిజం పెట్టాలి కాబట్టి పెట్టినట్టుంది. దాని వల్ల కూడా కథకి ఒరిగేది శూన్యం.
దర్శకుడిగా సానా బుచ్చిబాబుకు మంచి మార్కులే పడతాయి. కాకపోతే కాకపోతే కథనం మందగించిందనే విమర్శలు వచ్చాయి. డైలాగుల్లో, కథనంలో కొత్తదనం ఉన్నా వేగం మందగించింది. క్లైమాక్స్ ను మాత్రం రసకందాకంగా తీర్చిదిద్దారు. కేవలం మూడు పాత్రల మధ్యే కథ నడవడం కూడా కథనంలో వేగం తగ్గడానికి కొంత కారణంగా గమనించవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, రీరికార్డింగ్ ఈ సినిమాని పైమెట్టులో నిలిపాయి. సముద్రం నేపథ్యంలో ఉప్పెంగిన ప్రేమ ఉప్పెన ఇది. అంతేగాని సముద్రానికీ ఉప్పెనకూ ఎక్కడా పోలిక ఉండదు. ప్రేమ ఉప్పెనలో ఎవరు మునిగారు అన్నదే ఇందులోని ప్రధాన అంశం.
సినిమాలో కనిపించిన సాగదీత క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన జస్టిఫికేషన్ చూశాక మంచి సినిమా చూశామన్న భావనను కలిగిస్తుంది. కానీ ఆ సాగదీత కూడా లేకుండా దర్శకుడు జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. పైగా హీరో పాత్రకు ఇచ్చిన ముగింపుపై భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇలా జరిగి ఉండకపోతే బాగుండేమో అని కూడా అనిపిస్తుంది. దర్శకుడు ఆ పాయింట్ మీదే కథను రాసుకున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆ ప్రధాన పాయింట్ ఏమిటన్నదే చెబితే థ్రిల్ ఉండదు. దీన్ని విషదాంత ప్రేమ కథ అని చెప్పటానికి కూడా వీలుండదు. డైలాగ్స్ మెప్పించాయి.
హైలైట్స్: కథనాల తరువాత ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది సంగీతమే. దేవిశ్రీ స్వరపరిచిన పాటలు మనసు మైదానంలో మంచువర్షమై కురుస్తాయి. ముఖ్యంగా ‘నీ కన్ను నీలి సముద్రం’ .. ‘జలజల జలపాతం’ పాటలు హృదయాన్ని అనుభూతుల అలలపై తేలియాడిస్తాయి. పాటలే ఈ కథను జనంలోకి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. షామ్ దత్ కెమెరా పనితనం కూడా ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ప్రతి దృశ్యాన్ని ఆయన అందంగా .. హృద్యంగా ఆవిష్కరించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ విషయానికొస్తే .. అక్కడక్కడా కత్తెరకి పని చెప్పవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి.
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
కళ: మౌనిక రామకృష్ణ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల : 12-02-2021
ఒక్కమాటలో: యువత గుండెల్లోని ప్రేమ ఉప్పెన
రేటింగ్: 3/5
– హేమసుందర్ పామర్తి











