Is YCP Extending Invitation To Former Minister Sujaya Krishnarangarao :
ఏపీలో జగన్ పాలన రెండున్నరేళ్లకు దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీలో కీలక మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కేబినెట్ లోని చాలా మంది మంత్రులు మాజీలు కానుండగా.. వారి స్థానంలో కొత్తవారు మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగన్ తన కేబినెట్ లోని మొత్తం మంత్రులను మాజీలను చేసేసే దిశగా కదులుతున్నారట. ఇదే జరిగితే.. ఇతరుల మాట ఎలా ఉన్నా.. అటు రాయలసీమకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణలను ఎలా అనునయించాలో కూడా తెలియని పరిస్థితి. మంత్రి పదవి లేనిదే పెద్దిరెడ్డి అయినా ఊరుకుంటారేమో గానీ.. బొత్స మాత్రం వినే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే తన జిల్లా విజయనగరంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన బొత్స.. తనకు తెలియకుండా అటు పార్టీ పరమైన నిర్ణయాలు గానీ, ఇటు ప్రభుత్వ నిర్ణయాలు గానీ అమలు కావడానికి వీల్లేదన్న రీతిలో సాగుతున్నారు. అంతేనా జగన్ కు తెలియకుండానే ఇటీవల ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న బొత్స.. వైసీపీలో కొత్త తరహా పరిణామాలకు తెర తీశారు. వీటన్నింటినీ గమనిస్తున్న జగన్.. బొత్సకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే దిశగా కదులుతున్నారట.
సుజయకు ఆహ్వానం
బొత్స ఉత్సాహానికి కత్తెర వేసే వ్యూహాన్ని ఇప్పటికే రచించిన జగన్.. దానిని ఇప్పుడిప్పుడే అమల్లో పెట్టారట. ఈ వ్యూహం ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన మరో బలమైన నేతను పార్టీలోకి ఆహ్వానిస్తారట. జిల్లాలో బొత్సను తట్టుకుని నిలబడగలిగే నేతలు వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు బొబ్బిలి రాజ వంశానికి చెందిన సుజయ సోదరులు మాత్రమే బొత్స స్పీడుకు బ్రేకులు వేయగలిగే నేతలుగా జగన్ గుర్తించారట. అశోక్ ఎలాగూ వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది బొబ్బిలి సోదరులే కదా. వీరిలో బేబి నాయన జగన్ కు అనుకూలంగానే ఉంటున్నా.. మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు మాత్రం జగన్ అంటే ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇటు జగన్ కూడా సుజయ పేరు చెబితేనే నిన్నటిదాకా అగ్గి ఫైరయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జగన్ కు సుజయ అవసరం ఉంది. అలాగే అధికార పార్టీలో ఉండాలని భావిస్తున్న సుజయకు జగన్ అవసరం ఉంది. అంతేకాకుండా గతంలో వైసీపీలో కొనసాగిన నేపథ్యం కూడా సుజయకు కలిసివచ్చే పాయింటే.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
సుజయను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ కు రెండు అంశాల్లో కలిసి రానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుజయను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఓ వైపు బొత్సకు చెక్ పెట్టడం ఈజీ అయితే.. మరోవైపు తమ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన అశోక్ గజపతిరాజుకు కూడా సుజయ ద్వారా చెక్ పెట్టే అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారట. అశోక్ కు చెక్ మాటేమో గానీ.. బొత్సకు అయితే సుజయతో చెక్ పెట్టేయొచ్చు. ఎందుకంటే.. వ్యవహారంలో అశోక్ మాదిరే సుజయ కూడా మిస్టర్ క్లీనేనని చెప్పాలి. అయితే బొత్సపై లెక్కలేనన్ని అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పురన్వవస్థీకరణ సమయంలోగా సుజయను పార్టీలోకి చేర్చుకోగలిగితే.. జగన్ చెప్పినట్లుగా బొత్స వినక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే.. విజయనగరంలో బొత్స హవాకు చెక్ పడటంతో పాటు మంత్రి పదవి పీకేసి పార్టీ బాధ్యతలు అప్పగించినా.. బొత్స నోరెత్తకుండానే సాగుతారన్న మాట. చూద్దాం మరి జగన్ పాచిక ఏ మేరకు వర్కవుట్ అవుతుందో?.
Must Read ;- జగన్ కు బొత్స భయం పట్టుకుందా?