Jagan Govt Changes Name Of Telugu Academi To Telugu and Sanskrit Akademi :
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తనదైన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాను తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు లాంటి వారు నిరసన గళం విప్పినా కూడా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు. తాజాగా దివంగత నేత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు సీఎంగా ఉండగా ఏర్పాటైన తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ లాంటి తెలుగు భాషా పండితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతదాకా బాగానే ఉన్నా.. ప్రస్తుతం తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ గా ఉన్న ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఈ పరిణామంపై నోరు విప్పని వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
ఎన్టీఆర్ హయాంలో తెలుగు అకాడెమీకి వెలుగు
ప్రాంతీయ భాషలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు అనుగుణంగా అప్పుడెప్పుడో 1966లో అంకురార్పణ జరగగా.. తెలుగు భాషపై అమితమైన మమకారం కలిగిన ఎన్టీఆర్ సీఎం సీట్లో కూర్చోగానే.. తెలుగు అకాడెమీకి అన్నీ సమకూరాయి. చూస్తుండగానే.. ఆ సంస్థ తెలుగు భాషాభివృద్ధిలో తనదైన కీలక భూమిక పోషించడం మొదలైంది. ఇప్పుడంటే.. ఆంగ్ల మాధ్యమం అంటూ విద్యార్థులు వెర్రెత్తుతున్నారు గానీ.. గతంలో తెలుగు మీడియంలోనే అధికంగా చదివే విద్యార్థులందరికీ తెలుగు అకాడెమీ ముద్రించే పాఠ్య పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడిన వైనం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన అమితంగా అభిమానించే తెలుగు అకాడెమీ ప్రాభవం కూడా తగ్గుతూ వచ్చింది. తాజాగా జగన్ అధికారంలోకి వచ్చాక.. తెలుగు అకాడెమీకి ఎన్డీఆర్ రెండో సతీమణి లక్ష్మీపార్వతినే చైర్ పర్సన్ గా నియమించారు.
పేరు మార్చినా లక్ష్మీపార్వతి స్పందించరా?
లక్ష్మీపార్వతి చైర్ పర్సన్ అయితే.. తెలుగు అకాడెమీకి ఎన్టీఆర్ హయాం నాటి పూర్వ వైభవం ఖాయమన్న వాదనలూ వినిపించాయి. అయితే రెండేళ్ల పాటు తెలుగు అకాడెమీని టచ్ చేయని జగన్.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సంస్థ పేరును మార్చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సరే.. జగన్ కు తెలుగు అకాడెమీ ప్రాధాన్యం తెలయదనుకోవచ్చు.. అయితే ఎన్టీఆర్ రెండో సతీమణిగా లక్ష్మీపార్వతి ప్రత్యక్షంగా ఆ సంస్థకు చైర్ పర్సన్ గా ఉండి కూడా జగన్ నిర్ణయంపై కిమ్మనకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మొత్తంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష్మీపార్వతి అడ్డంగా బుక్కైపోయారని చెప్పాలి.
Must Read ;- సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జగన్











