ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ జగన్ సర్కారుకు చెమటలు పట్టిస్తుండగా ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడ రంగంలోకి దిగనున్నారు. గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ గతంలో లాగా ప్రజల్లోకి వెళ్లి జగన్ సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్నారు. రేపు విజయవాడ చేరుకోనున్న పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జులై7న జనసేన ముఖ్యనేతలతో సమావేశమై ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం వివాదాస్పదమైన జాబ్ క్యాలెండర్, ఏపీ- తెలంగాణల మధ్య రగులుతున్న జలవివాదం తదితర ప్రధాన అంశాలపై పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై నిర్ణయించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితులపైన దృష్టి సారించనున్నారు.
సీఎం అభ్యర్థిగా ప్రకటించగా..
ఏపీలో బీజేపీ- జనసేన మధ్య పొత్తులో భాగంగా తిరుపతి ఉప ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పవన్ తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ఒక రోజు ప్రచారం కూడ నిర్వహించారు. తర్వాత కరోనా బారిన పడిన పవన్ అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉండి పోయారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత రైతులను పరామర్శించి జగన్ సర్కారు విధానాలను, అక్కడి ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టిన పవన్ తర్వాత ప్రతక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. దీంతో జనసైనికులు కూడ నిస్తేజంలో పడిపోయారు. చాలా కాలం విరామం తర్వాత మళ్లీ జనసేనాని ప్రజల్లోకి వెళ్లాలను కోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్ సర్కారుపై ఫోరుకు ఏయే అంశాలను ఎంచుకుంటారు, ఎలా ముందుకు వెళతారన్నది వేచి చూడాలి.
నిరంతరం పోరాడుతున్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రం ప్రజల సమస్యలపై జగన్ సర్కారుపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దుపై అలుపెరగని పోరాటం చేసి అందరి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అభ్యర్థుల ఎంపికలో లోపాలు, జగన్ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పైన పోరాడుతూ యువతకు, నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు. జగన్ సర్కారు చేపట్టిన ఏ ప్రజా వ్యతిరేక విధానమైనా తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
ఇలా, ఓ వైపు లోకేష్ ఉండగా, మరో వైపు పవన్ రంగంలోకి దిగనుండటంతో జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.
Must Read ;- ఎనీ ఫ్లాట్‌ఫామ్..ఎనీ టైమ్.. సింగిల్ హ్యాండ్ నారా లోకేష్











