వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ అధినేత, ఏపీకి ముఖ్యమంత్రి కూడా. తనను ధీరాదిదీరుడిగా అభివర్ణించుకుంటారు. ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఓ రేంజి ప్రకటనలూ చేస్తారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే సహించేది లేదనీ చెబుతుంటారు. ఏపీ ప్రయోజనాలను మించి తనకు ఏదీ ముఖ్యం కాదనీ చెబుతారు. ఈ దిశగా ఎవరితో పోరుకైనా వెనుకాడేది లేదని జబ్బలు చరుస్తారు. ఈ విషయంలో మాట తప్పేది లేదని, మడమ తిప్పేదీ లేదని తనదైన పంచ్ డైలాగులూ వల్లిస్తారు. అయితే ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. ఇప్పటికే మాట తప్పిన నేతగా, మడమ తిప్పిన నేతగా ముద్ర వేయించుకున్న జగన్.. తన స్వప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి వణికిపోతున్నారు. సాక్షాత్తు తన తండ్రి వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు తులనాడినా.. కిమ్మనకుండా ఉండిపోయారు. ఈ విషయంలో ఇప్పటికే జగన్ పై విపక్ష టీడీపీ తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. అయితే జగన్ ను అభిమానించే వారు మాత్రం అవన్నీ రాజకీయ ఆరోపణలేనని నిన్నటిదాకా కొట్టిపారేశారు. అయితే తన కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక సాక్షిగా జగన్ తన భయాన్ని బయటపెట్టుకున్నారు. తనపై తన పార్టీ శ్రేణులు, అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్నీ వమ్ము చేశారు.
ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా
ప్రస్తుతం సాగు నీటి వాటాల విషయంలో తెలంగాణతో ఏపీకి వివాదం తలెత్తింది. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ మాట మార్చేసింది. గడచిన ఏడేళ్లుగా 34 శాతం నీటితోనే సరిపెట్టుకున్న తెలంగాణ.. ఇప్పుడు కొత్తగా 50 శాతం వాటా కావాలని అడుగుతోంది. ఈ మాటను కేసీఆర్ తనదైన శైలిలో గట్టిగానే డిమాంవ్ చేశారు. కేసీఆర్ దురుద్దేశాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవలే ఎంపికైన రేవంత్ రెడ్డి.. తెలంగాణకు చెందిన నేత అయి కూడా బయటపెట్టారు. అలాంటిది జగన్.. కేసీఆర్ ను నిందిచేందుకు సాహసించడం లేదు. ఇందుకు నిదర్శనంగా ఆయన కుటుంబం నేతృత్వంలోని సాక్షి దినపత్రికే తేల్చి చెప్పింది. సోమవారం నాటి సాక్షి దినపత్రికకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రతులను తీసుకుని పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది. తెలంగాణ ఎడిషన్ లో కేసీఆర్ సిరిసిల్లా పర్యటనను బ్యానర్ గా వేసిన సాక్షి.. ఏపీ ఎడిషన్ కు వచ్చేసరికి కేసీఆర్ డిమాండ్ చేసిన 50 శాతం వాటాను ప్రశ్నిస్తూ *అర్ధభాగం అసంబద్ధం* పేరిట బ్యానర్ కథనాన్ని రాసింది. ఈ కథనం తెలంగాణ ఎడిషన్ లో ఫ్రంట్ పేజీలో కాదు కదా.. లోపలి పేజీల్లో కూడా ప్రచురించలేదు.
జగన్ కంటే రేవంతే ధైర్యస్తుడు
తెలంగాణ అసంబద్ధ వాదన వినిపిస్తోందని ఏపీ ఎడిషన్ లో రాసుకున్న సాక్షి.. ఆ వార్తను తెలంగాణ ఎడిషన్ లో ప్రచురించలేదంటే.. తెలంగాణలో ఈ వార్త ప్రచురితమైతే తనకు ఇబ్బందేనని భావించినట్టే కదా. అంతిమంగా తెలంగాణను చూసి జగన్ భయపడినట్టే కదా. మరి ఏపీ ప్రయోజనాలే ముఖ్యమంటూ చెబుతున్న సీఎం.. ఏపీకి అన్యాయం జరిగేలా కేసీఆర్ వ్యవహరిస్తే తెలంగాణలో తన పత్రిక ద్వారా ఎందుకు ప్రశ్నించరు? తెలంగాణకు చెందిన నేత అయి ఉండి రేవంత్ రెడ్డే.. కేసీఆర్ వాదన తప్పని, తెలంగాణ కొత్త వాదనలో అసంబద్ధత ఉందని చెప్పినప్పుడు కనీసం.. ఏపీకి సీఎంగా ఉన్నజగన్ తెలంగాణలో ఆ మాటను పలకలేకపోతే భయపడిపోయినట్టే కదా. మొత్తంగా కేసీఆర్ ను చూసి జగన్ భయపడుతున్నట్టే కదా. మరి దీనిపై వైసీపీ శ్రేణులు గానీ, జగన్ అభిమానులు గానీ ఏమంటారోనన్న వాదనలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Must Read ;- జగన్ వదిలేసినా.. రేవంత్ వదలరంట