ఏపీలో కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలనపై తనదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు తాజాగా మరింత జోరును పెంచేశాయి. జగన్ పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపడంతో పాటుగా టీడీపీని మరోమారు అధికారంలోకి తీసుకురావడం, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మరోమారు సీఎంగా చూడటమే లక్ష్యంగా సాగుతున్నారు. ఈ దిశగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి మరీ తాడిపత్రి మునిసిపాలిటీలో పార్టీ జెండాను ఎగురవేసి.. మునిసిపల్ చైర్మన్ గా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబును సీఎం కుర్చీ ఎక్కించేదాకా విశ్రమించేది లేదని ఆయన ప్రకటించారు. ఇందుకోసం బారీ కసరత్తు మొదలుపెట్టినట్లు కూడా జేసీ వెల్లడించారు.
సీఎం ఫొటోను చెప్పుతో కొట్టారుగా
శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. జగన్ సాగిస్తున్న దుర్మార్గాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే కేసులు పెడుతూ అరెస్ట్ లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చెప్పుతో కొట్టి తాడిపత్రి విడిపిస్తానని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారని.. విశాఖలో సాక్షాత్తు సీఎం ఫొటోను చెప్పుతో కొట్టి ఊరేగించిన వైనాన్ని సరిదిద్దుకోవాలని తనదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలపై ఇప్పటిదాకా సాగిన పోరు ఒక ఎత్తైతే.. ఇకపై సాగే పోరుతో వైసీపీ శ్రేణులు పరారు కావాల్సిందేనని కూడా జేసీ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలకు చెల్లుచీటి ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తామని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి పూర్వ వైభవమే లక్ష్యం
టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, చంద్రబాబును మరోమారు సీఎం కుర్చీ ఎక్కించేందుకు ఓ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలను ఎదురొడ్డి నిలిచేలా టీడీపీ కార్యకర్తలను తీర్చిదిద్దుతామని, తాడిపత్రిలో ఏకంగా 10 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వైసీపీ దౌర్జన్యాలను ఎదిరించే క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయబోమని, చంద్రబాబును సీఎంగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని జేసీ చెప్పారు. మొత్తంగా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే దిశగా మరిన్ని కీలక చర్యలు చేపతామంటూ జేసీ చేసిన ప్రకటన వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోందనే చెప్పాలి.
Must Read ;- రఘురామకు నోటీసు.. వైసీపీ చక్రం తిరుగుతోందా?