నిజంగానే.. వైసీపీలో గ్రూపు రాజకీయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ బజారుకెక్కుతున్నారు. ఈ తరహా పరిస్థితి ఏ ఒక్క జిల్లాలోనే కాదు.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. సొంత పార్టీకి చెందిన రమేశ్ రెడ్డిపై చేయి చేసుకున్న వైనం వైరల్ గా మారిపోయింది. పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో అధికారుల తీరును తప్పుబట్టిన రమేశ్ రెడ్డిని.. నడి బజారులో అందరూ చూస్తుండగానే పెద్దారెడ్డి కొట్టేశారు. పెద్దారెడ్డి చేయి చేసుకోవడంతో ఆయన అనుచరులంతా రమేశ్ రెడ్డిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ ఘటనతో తాడిపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసలేం జరిగింది?
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందుకనుగుణంగా ఎక్కడికక్కడ లక్షలాది మందిని లబ్దిదారులుగా గుర్తించారు. వారికి అవసరమైన స్థలాలను ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేసిన జగన్ సర్కారు.. ఇళ్ల నిర్మాణాలను కూడా మొదలెట్టింది. ఈ క్రమంలో తాడిపత్రిలోనూ ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అయితే లబ్ధిదారుల విషయంలో అనుమానం వచ్చిన రమేశ్ రెడ్డి.. తన అనుమానం నిజమేనని తెలుసుకుని అధికారులను ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పెద్దారెడ్డి.. రమేశ్ రెడ్డిని నిలదీశారట. అయితే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటామని ఎదరు ప్రశ్నించారు. దీంతో కోపం పట్టలేని పెద్దారెడ్డి.. రమేశ్ రెడ్దిపై చేయి చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో రమేశ్ రెడ్డి షాక్ లో కూరుకుపోగా.. పెద్దారెడ్డి అనుచరులు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగారు.
అంతటా ఇదే పరిస్థితి..
ఇదిలా ఉంటే.. తాడిపత్రిలో సోమవారం చోటుచేసుకున్న దాడి తరహాలో ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పలు దాడులు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో కొన్ని సార్లు ఎమ్మెల్యేల వర్గం కూడా గాయాలపాలవుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును అక్కడి వైసీపీ నేతలు ఒప్పుకోవడం లేదు. దీంతో నిత్యం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ పలు నియోజకవర్గాల్లో ఇదే తరహాలో సొంత పార్టీ నేతల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి ఓ ఘటనలో ఏకంగా ఓ వైసీపీ కార్యకర్త కూడా చనిపోయిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Must Read ;- జగన్ ‘డిప్యూటీ’లంతా డమ్మీలే!











