వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో లెక్కలేనన్ని కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా శనివారం నాడు వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంలో జగన్ సొంత జిల్లా కడప జిల్లా కీలక భూమిక పోషించిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే కేంద్రంగా సాగిన ఈ దందాలో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన వైనంపై ప్రభుత్వకే శనివారం కీలక వివరాలు వెల్లడించింది. ఈ కుంభకోణంలో పాత్ర ఉందన్న భావనతో ఇప్పటికే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్సెండ్ కాగా.. ఈ కేసు ఇంకెంత మందిని పట్టిస్తుందోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా రిజిస్ట్రార్ ఆఫీసులనే కేంద్రంగా చేసుకుని దందారాయుళ్లు నడిపిన ఈ భారీ కుంభకోణంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చకే తెర లేసింది. పాత్రధారులను గుర్తించిన ప్రభుత్వం.. సూత్రధారులను పట్టుకునే దిశగా కదులుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు వివరాలేంటంటే..?
ఏపీలోని రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ శనివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ సమగ్ర వివరాలు వెల్లడించారు. చలాన్ల అంశంలో శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా మొత్తం 65 లక్షల డాక్యుమెంట్లు పరిశీలించామని.. వీటిలో రూ.5 కోట్ల మేర నష్టం జరిగినట్టు వెల్లడైందని పేర్కొన్నారు. 770 డాక్యుమెంట్లలో భారీ మోసాలు జరిగాయని.. వీటికి సంబంధించి ఇప్పటిదాకా రూ.1.37 కోట్లు రికవరీ చేశామన్నారు. చలాన్లు కట్టారో లేదో విచారణలో తేలుతుందని, కొనుగోలుదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రజత్ భార్గవ్ వివరించారు. స్కాం జరిగిన 9 జిల్లాల్లో కడప, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక మోసాలు జరిగినట్టు తేలిందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా మొత్తం 10 మందిపై ఆరోపణలు ఉన్నాయని, ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని వెల్లడించారు. దీనిపై సీఐడీ విచారణ అవసరం లేదని, పోలీసు కేసు సరిపోతుందని రజత్ భార్గవ్ అభిప్రాయపడ్డారు.
టీడీపీ నేతలేమంటున్నారు?
రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి చలాన్ల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంత్రి నుంచి అనేక మంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయన్నారు. చలాన్ల కుంభకోణంలో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణ చేసి చేతులు దులుపుకోవాలనుకోవటం కుట్రలో భాగమేనన్నారు. ఇది గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం మించిపోతుందని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ కుంభకోణానికి సంబంధించి నిజానిజాలు వెలుగు చూస్తాయని అభిప్రాయపడ్డారు.
Must Read ;- దోపిడీలో వైసీపీ ఇలా బుక్కైపోయింది