సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగాలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు 2024 వరకు సభలో మాట్లాడే అవకాశమే లేకుండా చేయాలని సభా హక్కుల కమిటి (ప్రివిలేజ్‌కమిటి) తీర్మానించింది. ఈ మేరకు మంగళవారం ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన కమిటీ.. తన నిర్ణయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫారసు చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ హోదాలో కాకాణే వెల్లడించారు. అచ్చెన్నాయుడితో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపైనా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని కూడా ప్రివిలేజ్ కమిటీ తీర్మానించడం గమనార్హం.
అసలు మరచి కొసరుతో చర్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అచ్చెన్నతో పాటు కూన రవికుమార్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ముగ్గురు నేతలు.. నిత్యం రాజకీయ విమర్శలు చేసుకునే వారే. అయితే తమ్మినేని ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉంటూ కూడా ముందుగా తాను ఎమ్మెల్యేనని, ఆ తర్వాతే స్పీకర్ నని పలుమార్లు ప్రస్తావించారు. రాజకీయ వైరం నేపథ్యంలో అచ్చెన్నతో పాటు కూన కూడా తమ్మినేనిపై తమదైన శైలి విమర్శలు గుప్పించారు. స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారిద్దరిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తొలుత కూన రవికుమార్ తో పాటుగా అచ్చెన్న కూడా హాజరు కాలేదు. అయితే సభలో టీడీపీ ఉప నేతగా ఉన్న అచ్చెన్న ఇటీవలే కమిటీ విచారణకు హాజరయ్యారు. తమ్మినేనిపై తానేమీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయలేదని, అదంతా రాజకీయ వైరమేనని, అయినా కూడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగి ఉంటే చింతిస్తున్నానని బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో అచ్చెన్నపై చర్యలు ఉండవని అంతా భావించారు. అయితే ఈ అంశాన్ని వదిలేసిన కమిటీ.. మరో అంశాన్ని తీసుకుని అచ్చెన్నపై చర్యలకు సిఫారసు చేసింది.
అచ్చెన్నతో పాటు నిమ్మలపైనా..
వాస్తవానికి స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారంపైనే ప్రివిలేజ్ కమిటీ దృష్టి సారించిందని అంతా అనుకున్నారు. అయితే ఆ విషయంలో అచ్చెన్న బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ విషయంలో ఆయనపై చర్యలకు అవకాశం లేదు. మరేం చేయాలన్న కోణంలో ఆలోచించిన వైసీపీ.. సభలో ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డితో కమిటీకి ఓ ఫిర్యాదు చేయించింది. అచ్చెన్నతో పాటు నిమ్మల కూడా సభను తప్పుదోవ పట్టించారని శ్రీకాంత్ రెడ్డి కమిటీకి ఫిర్యాదు చేశారు. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పింఛన్ల విషయంలో నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని శ్రీకాంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారట. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిటీ.. శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదులోని అంశాలు నిజమేనని తేల్చిందట. దీంతో సభలో అచ్చెన్నతో పాటు నిమ్మలకు కూడా 2024 వరకు మైకే ఇవ్వరాదని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫారసు చేసింది. ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసిందంటే.. స్పీకర్ ఆమోదం తప్పనిసరే కదా. అంటే.. అచ్చెన్నతో పాటు నిమ్మల వాయిస్ కూడా ఏపీ అసెంబ్లీలో వినిపించదన్న మాట.
Must Read ;- మొత్తంగా టీడీపీపైనే పెట్టేస్తే పోయేదిగా











