రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తెలివిగా, గోప్యంగా జరుగుతున్న ఈ పోరు ఎప్పుడు బయట పడుతుందో అన్న ఆందోళన కేడర్‌ను వెంటాడుతోంది. వీరిలో ఒకరు రాజకీయ అనుభవంలో తనకు తానే సాటిగా ఉన్న ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి కాగా.. ఇంకొకరు ఇప్పడిప్పుడే వ్యాపార రంగం నుండి రాజాకీయాల్లో అడుగు పెట్టిన ఎంపీ రంజిత్ రెడ్డి. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బలమైన నేతలే. ఈటెల రాజేందర్ సహకారంతో కేసీఆర్‌కు దగ్గరైన రంజిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.
Also Read:-గ్రేటర్‌లో పరీక్షించు కుందాం.. రంగంలోకి మంత్రి సబిత వారసుడు
కార్యకర్తల బలం
ఇక సబితా ఇంద్రారెడ్డి వైఎస్ హయాంలో హోంశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా ఆమె మంత్రిగా పని చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో తన తనయుడిని ఎంపి బరిలో దింపిన సబితా ఇంద్రారెడ్డి తాను పోటీ నుంచి తప్పుకున్నారు. తాజాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆ జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో ఇంద్రారెడ్డి హయాం నుండి ఈ కుటుంబానికి గట్టి కార్యకర్తల బలం ఉంది. దీంతో ఆమె ఓటమెరుగని నేతగా ఉన్నారు. ఆ జిల్లాలో ఏదైనా తన కనుసన్నల్లోనే జరగాలనుకుంటారు ఆమె.
Also Read:-ఎంసెట్ ఫలితాల్లో టాప్ టెన్‌లో ఉన్నది వీళ్లే!
పట్టు కోసం ప్రయత్నం
ఎంపీగా రంజిత్ రెడ్డి గెలుపొందిన తరువాత ఆ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు తన కనుసన్నల్లోనే ఉండాలన్న తలంపుతో అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తన ఎంపీ పరిధిలో ఉన్న కొన్ని గ్రేటర్ డివిజన్‌లలో తన వారికి టికెట్లు కూడా ఇప్పించుకున్నట్టు సమాచారం. అయితే సబితా ఇంద్రారెడ్డి , రంజిత్ రెడ్డి ఎదుగుదలను తట్టుకోలేక పోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రంజిత్ రెడ్డికి సంబంధించిన వారికి టికెట్ ఇప్పించుకున్నారని .. ఆయనపై పొగడ్తలు వస్తున్న నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇలా ఆధిపత్య పోరు సాగుతుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Must Read:-బంగారు తెలంగాణలో వజ్రాల జిల్లాలు!