స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ , సంఘర్షణ సృష్టి మొదటి నుంచే ఉంది . ముఖ్యంగా నగర జీవితాల్లో ఈ బంధాలు ఉద్వేగ భరితం గా… ఒక్కోసారి ఇబ్బంది కరంగా మారుతుంటాయి . వీటి చుట్టూ రాసి , తీసిన కథలే ” మెట్రో కథలు ” ఈ వెబ్ ఫిలిం అనే కాదు ..డిజిటల్ ప్లాటుఫారమ్ మీద వస్తున్న చాలా కథలు సెక్స్ చుట్టూ అల్లుతున్నారు ..
అంటే హ్యూమన్ ఎమోషన్స్ లో జనాన్ని తెర కి కట్టి పడేసేది సెక్ స్ తప్ప మరొకటి కాదు అని వినోద రంగం తేల్చేసిందా ?! థియేటర్ కి వెళ్లడం , సినిమా చూడటం మన ఛాయస్ !కానీ ఇంట్లో , నలుగురి తో కూర్చుని చూసేటప్పుడు కొన్ని అంశాలు ఇబ్బంది గా ఉంటాయని మేకర్స్ భావించడం లేదా ? లేక వారు చెబుతున్న బోల్డ్ నెస్ కి ప్రేక్షకులు సిద్ధ పడి ఉండాలని భావిస్తున్నారా ?!
ఇక ఈ మెట్రో కథలు గురించి తెలుసుకుందాం ..
మొదటి కథ : ప్రపోజల్
నక్షత్ర , తిరువీర్ నటించిన ఈ ” ప్రపోజల్ ” కథ లో ఓ ఉద్యోగిని అయిన అమ్మాయి తనతో పని చేసే అబ్బాయి పెళ్లి ప్రతిపాదన తీసుకు వచ్చినప్పుడు ఏం చెప్పింది ? ఎలాంటి షరతులు విధించింది అనేది చెప్పారు . తన కుటుంబం బాధ్యతలు చెప్పిన అమ్మాయి చిన్న తనంలో తనకి ప్రొపోజ్ చేసి ముద్దు పెట్టిన అబ్బాయి గురించి చెప్పడంతో సమస్య మొదలు అవుతుంది .
” ఆ అబ్బాయి ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు ” అనే ప్రశ్న దగ్గర ఈ ప్రపోజల్ ఆగిపోతుంది . ఆ అమ్మాయి కుటుంబ సమస్యల కన్నా – ఇదే ఆ కుర్రాడిని వేధిస్తుంది. తిరువీర్ సినిమా సినిమాకి తనని తాను బాగా మలుచుకుంటున్నాడు . నక్షత్ర బాగా చేసింది . ఎక్కువ లొకేషన్స్ ఉండటం వల్ల – రాత్రి సమయం కావడం తో కెమెరా మాన్ వెంకట్ ప్రసాద్ బాగా తీశారు అనిపిస్తుంది.
రెండో కథ: ఘటన
సన , అలీ రెజా నటించిన కథ ” ఘటన ” . ఇది ఎంత అరాచకమో మాటల్లో చెప్పలేం . తాగుబోతు భర్తకి ఆక్సిడెంట్ అయి , హాస్పిటల్లో ఉంటే భార్య వచ్చి వైన్ షాప్ వాడిని లం కొడుకులు ” అని తిడుతుంటే యాక్సిడెంట్ చేసిన కుర్రాడు వచ్చి కలుస్తాడు . ఆవిడ స్ట్రెస్ లో ఉందని , తానే ఆవిడని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు . ( ఆవిడ భర్త ని వదిలి వస్తుంది ) ఆవిడ తన ఒంటరి తనం గురించి , భర్త నిరాదరణ గురించి చెప్పి అతడిని గట్టి గా హత్తుకుంటుంది . ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు .
సెక్ స్ తర్వాత ఆవిడ స్నానం చేసి , బ్రెడ్ , పాలు తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరుతుంది . ఆ కుర్రాడు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడిగితే మళ్ళీ కలవద్దు అని చెబుతుంది . ఒక స్త్రీ కి ఒంటరితనం ఉండొచ్చు, ఓదార్పు కావచ్చు .. కానీ భర్త ఆస్పత్రిలో ఉన్నప్పుడు రొమాన్స్ చేయడమే క్రియేటివిటీనా అనిపిస్తుంది.
మూడో కథ: సెల్ఫీ
నందిని రాయ్ , రామ్ మద్దుకూరి ” సెల్ఫీ” అనే మూడో కథ లో నటించారు . ఇది కూడా అనైతిక సంబంధం మీద రాసిన కథే . భర్త ప్రేమ పూరితం అయిన స్పర్శ దొరకక – వేరే వ్యక్తి తో రిలేషన్ లో ఉన్న ఓ అమ్మాయి కి సడన్ గా రొమ్ము కాన్సర్ వస్తుంది . ప్రేమ రాహిత్యం వల్ల .. ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పిన కథ . ఆ అమ్మాయి కి వచ్చిన రోగం కన్నా , ఆ అమ్మాయి పెట్టుకున్న అక్రమ సంబంధం ఎక్కువ గుర్తు ఉండిపోయేలా ఉంది ఈ కథ
నాలుగో కథ: తేగలు
రాజీవ్ కనకాల వాచకం గాయత్రీ భార్గవి ప్రధాన పాత్రలు పోషించిన కథ ” తేగలు ” . రాజీవ్ కనకాల పాత్రకి తేగలు అంటే ఎందుకు అంత ఇష్టమో , ఎందుకు పుట్టిన రోజు పార్టీలకు వెళ్ళాడో హార్ట్ టచింగ్ గా చెప్పిన కథ . నాలుగు కథల్లో మంచి కథ . రాజీవ్ కనకాల తన సహజ ధోరణి లో చేసుకు పోయారు . అయితే ముస్లిం వ్యక్తి గా భాష వాచకం లో తేడా చూపించ లేదు . భార్గవి మాత్రం ఉన్న పరిధి లో బాగా చేశారు .
ఎలా ఉంది?: మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వాటిలో మంచి కథలు చాలా ఉన్నాయి కానీ వీటినే ఎందుకు ఎన్నుకున్నారో వారికే తెలియాలి . కరుణ కుమార్ దర్శకత్వ చెమక్కులూ కనిపించ లేదు. నిర్మాణ విలువలైతే- ఎప్పుడో కొన్నేళ్ల క్రితం దూరదర్శన్ లో వచ్చిన సింగల్ ఎపిసోడ్స్ ని గుర్తు చేసింది.
నటీనటులు: రాజీవ్ కనకాల, అలీ రేజా, సనా, నందినీ రాయ్, రామ్ మద్దుకూరి, తిరువీర్, నక్షత్ర, గాయత్రి భార్గవి తదితరులు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి మందాడి, రామ్ మద్దుకూరి
దర్శకత్వం: కరుణ కుమార్
వేదిక: ఆహా
Rating :1.5/ 5