సూపర్ స్టార్ మహేశ్ బాబుకి తండ్రి కృష్ణ అంటే.. ఎనలేని ప్రేమ.. అంతకు మించిన గౌరవం. ఆయన పుట్టిన రోజు అంటే అతడికి పండుగలాంటిది… తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్టేట్స్ కైనా.. దానికి మించిన సందర్బం లేదన్నది అతడి అభిప్రాయం. అందుకే వచ్చేనెల్లో అంటే మే 31న కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ ను సిద్ధం చేశాడట.
మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవల దుబాయ్ షెడ్యూల్ లో నలభైరోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. కీలక సన్నివేశాల్నీ ఆ షెడ్యూల్ లోనే పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మహేశ్ సరైన లుక్ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. అందుకే దాన్ని ఇప్పుడు తన తండ్రి పుట్టిన రోజును సందర్భంగా మహేశ్ బాబు వాడుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ రోజున ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం.
మే 31న ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడంతో పాటు .. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ నటించబోయే సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. యన్టీఆర్ 30 వ సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ .. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను విరమించుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేశ్ తో చేయబోతున్నాడు. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాకి సంబంధించిన టీజర్ ను రెడీ చేసే పనిలో పరశురామ్ ఫుల్ బిజీగా ఉన్నాడట. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే. కొద్ది రోజాలు ఆగాల్సిందే.
Must Read : ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే !











