తిరుమల గిరులపై కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వైసీపీ నేతలు తమదైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అన్యమతస్తుల చొరబాట్లు పెరిగిపోతున్నాయన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తుంటే… తాజాగా ఏకంగా జగన్ కేబినెట్‌లో కీలక మంత్రులుగా ఉన్న ఇద్దరు అమాత్యులు స్వయంగా వెంకన్న సన్నిధిలో అన్య మతాల ప్రస్తావన చేశారు. సరిగ్గా వైకుంఠ ఏకాదశి రోజున మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కరోనా నేపథ్యంలో జారీ చేసిన టోకెన్లు పొందిన వారే స్వామివారి దర్శనానికి రావాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం అభ్యర్థనతో టోకెన్లు కలిగిన వారే వచ్చారు. వీఐపీ కేటగిరీలో ఉన్న వారు కూడా వైకుంఠ ఏకాదశి రోజున భారీ ఎత్తున తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు జగన్ కేబినెట్‌లో కీలక మంత్రులుగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తిరుమలకు వచ్చారు. నిబంధనల మేరకు స్వాగత సత్కారాలతో వారిద్దరూ వేంకటేశుడిని దర్శించుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… ఆ తర్వాతే వారిద్దరూ తమలోని స్వామి భక్తిని చాటుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ వివాదంలో చిక్కుకున్నారు.
Must Read ;- మల్లన్న సన్నిధిలో వైసీపీ వికృత క్రీడ.. బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్

నిబంధన అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా..
తిరుమలలో అన్యమతాలకు చెందిన ప్రస్తావన అస్సలు ఉండరాదు. ఈ నిబంధననను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోని అవంతి, నారాయణస్వామి… వెంకన్న చెంత ఇతర మతాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అవంతి ఏమన్నారన్న విషయానికి వస్తే… రాష్ట్ర ప్రజలందరికి కూడా క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెండు పర్వదినాలు ఈ నాడు ఒకే రోజు రావడం సంతోషం అంటూ ఆయన తిరుమల వెంకన్న ఆలయం ఆవరణలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన ఆయన… ప్రజలకు ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపే బదులుగా… దాని కంటే ముందుగానే క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పారు. మంత్రి గారి నోట నుంచి ఈ మాట వినగానే… వెంకన్న భక్తులు విస్తుపోయారు. వెంకన్న చెంతకు వచ్చి ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడమేమిటని కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు.
స్వామి భక్తిని మరింత మించిపోయేలా..
ఇక అవంతి చూపిన స్వామి భక్తిని మరింతగా మించిపోయేలా వ్యవహరించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరో అడుగు ముందుకేసి… వెంకన్న సన్నిధిలో క్రీస్తు పేరును ప్రస్తావించడంతోనే ఆగిపోకుండా… ఇస్లాం ప్రవక్త అల్లా పేరును కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి ఏమన్నారన్న విషయానికి వస్తే.. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. అదే విధంగా ఈ రోజు క్రిస్మస్ కూడా. ఆప్తుడైనటువంటి జగన్‌మోహన్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి అంటే అపారమైన భక్తి విశ్వాసం. ఇటు మా మతపరంగా, కులపరంగా పార్టీ పరంగా కాకుండా ఆ ఇద్దరి ఆశీస్సులు… ఇటు పవిత్ర దేవుడైన వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, క్రిస్మస్ దేవుడైన ఏసు ప్రభువు ఆశీస్సులు, మైనార్టీ దేవుడైన అల్లా ఆశీస్సులు జగన్‌కు మెండుగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఆయన తనదైన శైలిలో జగన్ భక్తిని చాటుకున్నారు.
అన్యమతాల ప్రస్తావన శిక్షార్షమని తెలియదా?
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వైకుంఠ ఏకాదశి నాడు.. అది కూడా తిరుమల వెంకన్నసన్నిధిలో ఇద్దరు మంత్రులు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా…. ఇతర మతాల పేర్లను, ఇతర మతాల దేవుళ్ల పేర్లను పలకడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల గిరులపై అన్యమతాల ప్రస్తావన శిక్షార్షమన్న విషయం వైసీపీ నేతలకు తెలియదా? అంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపై నారాయణస్వామి ఇతర మతాలను ప్రస్తావిస్తున్న సమయంలోనే ఆయనను అడ్డుకునే క్రమంలో ఓ భక్తుడు గట్టిగా కేకలు వేసిన వైనం కూడా కలకలం రేపుతోంది. మరి ఈ వ్యవహారం ఏ మేర రచ్చ రేపుతుందో చూడాలి.
Also Read ;- ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?











