పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగర ప్రజలు వింతరోగంతో విలవిలలాడిపోయారు. నిన్న ఉదయం దక్షిణ వీధిలో ఓ చిన్నారి నురగలు కక్కుతూ కింద పోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రారంభమైన వింతరోగం సాయంత్రానికి నగరమంతా విస్తరించింది. చిన్నారులు, యువకులు, పెద్దలు ఇలా వంద మందికిపైగా బాధితులు నోటివెంట నురగలు కక్కుతూ, ఫిట్స్ వచ్చిన వారిలా పడిపోవడంతో నగరం మొత్తం కలకలం రేగింది. రోగులకు అన్నీ పరీక్షలు చేసినా రోగం మాత్రం ఏమిటనేది వైద్యులు తేల్చలేకపోయారు. సీటీ స్కాన్ చేసినా రోగం అంతుపట్టలేదు. బాధితులకు ఫిట్స్ వైద్యం అందిస్తున్నారు. అయితే చాలా మంది కోలుకుంటున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించారు.
ఈ కథనం రాసే సమయానికి సుమారు 230 మంది వరకు ప్రభుత్వ, ప్రెవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో విజయవాడకు తరలించారు. అందరి ఆరోగ్య పరిస్థితి ఒక్కటే. అటు అధికారులు, నాయకులు, ప్రజలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా తలలు పట్టుకుని సతమతం అవుతున్నారు.
ఏ రోగాన్నయినా పరీక్షలు చేసి ఖచ్చితంగా పసిగట్టే పరీక్షలు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో డాక్టర్లకు కూడా అంతుచిక్కని రోగం ఏమిటి? వింతరోగం ఏమిటి? వందకు పైగా వ్యాధి బారిన పడ్డవారికి అన్ని రకాల పరీక్షలు చేసినప్పుడు రోగం బయటపడాలి కదా? కానీ డాక్టర్లకు కూడా రోగం అంతుపట్టలేదని, ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వైద్యం అందిస్తున్నట్టు చెబుతున్నారు. వింతరోగం మొదలైన కాలనీ నుంచి అన్నీ కాలనీలను అధికారులు పరిశీలించారు. అక్కడ మూడు రోజులుగా రంగుమారిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. అయితే, వివిధ ప్రాంతాల నుంచి నీటి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించినా.. అందులో ఎలాంటి వైరస్ సంబంధిత ఆనవాళ్లు కల్పించలేదని డాక్టర్లు చెబుతున్నారు
నీటి కాలుష్యం అయితే విరోచనాలు, వాంతులు లక్షణాలు సహజంగా ఉంటాయి.. కానీ జనం అకస్మాత్తుగా కిందపడిపోయి నురగలుకక్కుతూ గిలగిలకొట్టుకోవడం ఏమిటి? ఈ లక్షణాలు కలుషిత నీరు తాగిన వారిలో కనిపించేవి కావని నిపుణులు చెబుతున్నారు.
ఏలూరు నగరంలో కలకలం రేపిన వింతరోగం డాక్టర్లకు సైతం అంతుపట్టడంలేదు. రోగులకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలైతే నిలపగలిగారు. కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అనే దానిపై అధ్యయనం జరుగుతోంది. గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయిపోతున్న ఈ రోజుల్లో కారణం ఏదైనా కావచ్చు. కానీ వింతరోగం నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. ఏలూరు నగరంలో ఏదైనా హాటల్ లో ఆహారం కలుషితమైందా అనే కోణంలోనూ వైద్య అధికారులు ఆరా తీస్తున్నారు. ఏదైనా హోటల్ లో నీరు, ఆహారం కలుషితం అయితే నగరం నుంచి ఎవరైనా ఆ హోటల్ లో తిని వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ఎక్కడెక్కడ ఆహారం తీసుకున్నారు, ఎక్కడైనా బయట నీరు తాగారా? అనే విషయాలను కూడా సేకరిస్తున్నారు. అన్నీ అంశాలను అధ్యయనం చేస్తే ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంటుంది.
దోమలు కుట్టడం వల్ల ప్రజలు ఫిట్స్ వచ్చి పడిపోయే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఇలాంటి సందర్భాలు లేవు. దోమకాటుకు మలేరియా, డెంగీలాంటి జ్వర లక్షణాలు బయట పడతాయి. అకస్మాత్తుగా కిందపడి జనం గిలగిల కొట్టుకోవడం చూస్తుంటే ఏదైనా మందులు వికటించాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కరోనా వైరస్ దేశంలోని ప్రవేశించిన కొత్తలో కొందరు ఇలాగే కొంతపడి గిలగిలకొట్టుకున్నారు. తాజాగా కరోనా వైరస్ ఏమైనా రూపు మార్చుకుందా? అనే కోణంలోనూ వైద్యవర్గాలు దృష్టి సారించాలి.
వింతరోగం, అంతుచిక్కని రోగం అయితే ప్రపంచంలో మరో కొత్త రోగం వచ్చి చేరినట్టే భావించాల్సి ఉంటుంది. ఏలూరులో వంద మంది బాధితుల రోగ లక్షణాలను విశ్లేషించి ఖచ్ఛితంగా నిర్ధరించాలి. కరోనా తరహాలో ఇది కూడా ఏమైనా విరుచుకుపడుతుందా? అనే విషయం కూడా తేల్చాలి. వింతరోగం అని వదిలేస్తే, ఇది ఒక్క ఏలూరుతో పోతుందని భావించలేం. మరో చోట ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీ వేసి వింతరోగం అంతుచూడాల్సిన అవసరం ఉంది.
Also Read ;- కరోనాపై రీసెర్చ్ చేసి కొత్త వైద్యానికి దారి చూపిన తెలంగాణ సైంటిస్టు
ఇది ఎపిడమిక్..
సాధారణంగా హద్దుల్లేకుండా ప్రపంచం మొత్తం విస్తరించే కరోనా వంటి మహమ్మారి వ్యాధులను pandemic అని వ్యవహరిస్తారు. అయితే ఇప్పుడు ఏలూరులో బయటపడిన తరహా రుగ్మతలను epidemic అని వ్యవహరిస్తారు. విషవాయువుల వలన వ్యాపించే వ్యాధుల తరహాకు చెందినది అయి ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు కలుషితం అయితే గనుక.. 99 శాతం వరకు న్యూరో సమస్యలు తలెత్తే అవకాశం లేదు గనుక.. దీనిని అంతుచిక్కని వ్యాధిగా పరిగణిస్తున్నారు.
వార్తల ద్వారా తెలుస్తున్న రోగలక్షణాల్ని బట్టి.. ఇది MIS (Multisystem inflammatory syndrome) అయి ఉంటుందని కూడా కొందరు వైద్యులు భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి MIS అనేది పిల్లల్లోనే ఎక్కువగా బయటపడుతుంటుంది. ఇలాంటి లక్షణాలు బయటపడిన పిల్లల్లో కొవిడ్ కు కారణమయ్యే వైరస్ ఆనవాళ్లు కూడా ఉంటాయనేది ఒక అధ్యయనం. లేదా వారు కొవిడ్ సోకిన వారితో కలిసి తిరిగి ఉండడం వల్ల కూడా సోకుతుందనేది ఒక అంచనా. ఇదే MIS పెద్దవారిలో కూడా కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పోస్ట్-కొవిడ్ సిండ్రోమ్ అయి ఉండే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అయితే.. ఇలాంటి అంచనాల పట్ల అనుమానాలు ఏంటంటే.. ఇంత భారీగా సుమారు 230 మంది వరకు ఒకే తరహా రోగ లక్షణాలు కనిపించడం ఎలా సాధ్యం అనేదే.
నీటి శాంపిల్స్, రక్త నమూనాలు ఎన్ని పరీక్షించినా.. రోగం ఎందుకు వచ్చిందో వైద్యులకు అంతు చిక్కకపోవడంతో.. ఏలూరు ఎపిడెమిక్ చుట్టూతా అనేక ఊహాగానాలు రేగుతున్నాయి.
చిన్నారి పరిస్థితి ఎలా ఉంది?
ఏలూరులో పరిస్థితి విషమించడం వల్ల ఇద్దరిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. వారిలో చిన్నారి అన్నపురెడ్డి ప్రభను నిన్నే విజయవాడకు తీసుకువచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా చిన్నారి పరిస్థితి విషమంగానే ఉంది. విజయవాడ పాత ప్రభుత్వహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారి అన్నపురెడ్డి ప్రభ వాంతులు చేసుకుంటూనే ఉంది. ప్రత్యేక వైద్య బృందం అధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు రక్తనమూనాలు, యూరిన్ టెస్ట్ లు చేస్తున్నారు.
అన్నపురెడ్డి ప్రభ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉన్నట్లుండి కింద పడిపోయింది. వెంటనే స్ధానికులు, బంధువుల సహాయంతో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాం. అక్కడి డాక్టర్లు పరీక్షించిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడ తీసుకువచ్చాం. అప్పటి నుండి అప్పుడప్పుడూ వాంతులు చేసుకుంటునే ఉంది. మాకు చాలా భయంగా ఉంది.’’ అని తెలిపారు.
Must Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం