ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ అధిపతి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిజంగానే… తనపై కక్షసాధింపు చర్యలకు దిగిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కారుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో ఏబీవీ పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనను సస్పెండ్ చేసింది. అంతే కాకుండా ఏబీవీని శాశ్వతంగా సర్వీసు నుంచి డిస్మిస్ చేసే దిశగానూ అడుగులు వేస్తోంది. అయితే తనపై వైసీపీ సర్కారుది కక్ష సాధింపేనని ఆది నుంచి వాదిస్తూ వస్తున్న ఏబీవీ… తాజాగా జగన్ అండ్ కో షాకయ్యేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై జరిగిన, జరుగుతున్న దర్యాప్తులో జగన్ సర్కారు తప్పుడు పత్రాలను, ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పిస్తోందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఏబీవీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆదేశాలు కూడా జగన్ సర్కారు నుంచే వెలువడాలని కూడా ఏబీవీ మాస్టర్ స్ట్రోక్ లాంటి పంచ్ సంధించారు. ఈ మేరకు 9 పేజీలతో కూడిన లేఖను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌కు ఏబీవీ రాశారు.
సీబీఐ విచారణ కోరని పక్షంలో..
ఈ లేఖలో ఏబీవీ పలు సంచలన విషయాలను వెల్లడించారు. తాను కోరుతున్నట్లుగా ఏపీ సర్కారు తనకు తానుగా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరని పక్షంలో తాను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా ఏబీవీ హెచ్చరించారు. మొత్తంగా ఈ లేఖపై జగన్ సర్కారు తప్పనిసరిగా స్పందించక తప్పని పరిస్థితిని ఏబీవీ కల్పించారని చెప్పాలి. అంతేకాకుండా తాను రాసిన లేఖలో… తాను చేస్తున్న ఆరోపణలు ఎంతమాత్రం తప్పుడు ఆరోపణలు కాదని, వాటికి ఇదిగో ఆధారాలు అంటూ పకడ్బందీ ఆధారాలను జత చేశారు. అంతేకాకుండా తనపై జరుగుతున్న విచారణలో తప్పుడు పత్రాలు, ఫోర్జరీ పత్రాలు, అస్పష్టతతో కూడిన ఆదేశాలు, తగిన స్థాయి లేని అధికారులతో ఆదేశాలు జారీ చేయించడం లాంటి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇందుకు కూడా ఆధారాలివిగో అంటూ ఏబీవీ పెను కలకలమే రేపుతున్నారు.

ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతోందంటూ..
ఇక తనపై జరుగుతున్న విచారణలో తప్పుడు పత్రాలు గానీ, ఫోర్జరీ పత్రాలు గానీ జారీ చేయడం… ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతోందన్న విషయాన్ని కూడా ఏబీవీ వెల్లడించారు. ఈ పత్రాల తయారీ, విచారణకు అందజేయడం వంటి పనులు ఏవరో చిన్న స్థాయి అధికారులు చేసింది కాదని కూడా ఏబీవీ మరింత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్, ఏసీడీ డీజీ సీతారామాంజనేయులు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఇటీవలే సీఎస్‌గా పదవీ విమరణ చేసి ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నీలం సాహ్ని కనుసన్నల్లోనే జరిగిందని కూడా ఏబీవీ ఆరోపించారు. ఆరోపణలతోనే సరిపెట్టని ఏబీవీ… అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా తన లేఖకు జత చేయడం గమనార్హం. అంటే… తన లేఖపై జగన్ మోహన్ రెడ్డి సర్కారు స్పందించకుండా ఉండటం అసాధ్యమే. అంతేకాకుండా జగన్ సర్కారు నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా… తాను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా ఏబీవీ చెప్పడంతో ఇప్పుడు జగన్ వర్గం ప్రమాదంలో పడిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా ఏదో రకంగా ఏబీవీని ఇరికించేద్దామని యత్నించిన జగన్ వర్గం… ఇప్పుడు ఆ బోనులో తానే చిక్కుకుని గిలగిల్లాడుతున్నదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- ఇదీ అంతే నిజం.. ఏబీ వెంకటేశ్వరరావు నుంచి రివర్స్ స్వింగ్











