(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరంలో స్వర్గీయ పీవీజీ రాజు మాన్సాస్ సంస్థను స్థాపించి తద్వారా నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో స్పష్టం చేశారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మాన్సాస్ ఛైర్ పర్సన్ అనుచిత నిర్ణయాల వలన ఎమ్మార్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నిలుపు చేశారని, డిగ్రీని కూడా జీరో ఇయర్‌గా ప్రకటించారని తెలిపారు. విజయనగరం మహారాజ మహిళా కళాశాలలో తాను చదువుకున్నానని, విజయనగరం జిల్లాలోనే కాదు, చుట్టు ప్రక్కల జిల్లాల వారు కూడా చదువుకుని ఉన్నత స్థానాలలో ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్వర్గీయ పీవీజీ రాజు మాన్సాస్ సంస్థకు వేలాది ఎకరాల భూమి, కోట్లాది రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌ను అప్పజెప్పినప్పటికీ, మాన్సాస్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇంటర్మీడియట్‌ను ఎమ్మార్ కళాశాలలో కొనసాగించకపోతే ప్రైవేట్ కళాశాలలో చదువుకునే స్థోమత వెనుకబడిన విజయనగరం జిల్లాలో చాలా మందికి లేదని, దయచేసి కళాశాలను కొనసాగించాలని, ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల మూసివేతకు ప్రణాళిక
విజయనగరంలో పేదలకు అత్యంత ఉపయోగకరమైన ఎమ్మార్ కళాశాలను మూసివేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తోందని, ఇది సరైనది కాదని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతమైన విజయనగరం జిల్లాలో నాణ్యమైన విద్య అందించాలన్న మంచి ఆలోచనతో మాన్సాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్వర్గీయ డా. పీవీజీ రాజు స్థాపించారని, సంస్థ నడవడానికి కావలసిన ఆర్ధిక వనరుల కల్పనకు తన భూమిని దానం చేశారని మండలి దృష్టికి తెచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఈ సంస్థ, ఇందులోని ఇనిస్టిట్యూషన్స్ నడుస్తున్నాయని తెలిపారు. ఇటీవల నూతనంగా ట్రస్ట్ బోర్డు ఛైర్ పర్సన్ వచ్చిన తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మానేశారని, కళాశాలను మూసివేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలలగా జీతాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు రోడ్డు మీద తిరిగి భిక్షాటన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థలో ఎంతోమంది చదువుకుని ప్రపంచ వ్యాప్తంగా మంచి స్థాయిలో ఉన్నారని, అందుచేత సంస్థను నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం మండలి ఛైర్మన్‌కు కలిసి వినతి పత్రం అందజేశారు.
Must Read ;- అమూల్ ఎక్కువ ధర చెల్లించడం పచ్చి అబద్ధం











