హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. మొత్తం మీద గత పదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలతో పోల్చితే ఈ సారి పెద్దగా ఏమి పోలింగ్ పెరగలేదు. 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలో 42.92 శాతం, 2016లో 45.27 పోలింగ్ శాతం కాగా ఈసారి 46.6 శాతం నమోదయ్యింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న లోక్‌సభ స్థానాల్లో 2014, 2019లో పోలింగ్ శాతం చూస్తే..వరుసగా చేవెళ్ల 60.05, 53.80, సికింద్రాబాద్ 53.02, 45.00 మల్కాజిగిరి 50.85, 42.75 , హైదరాబాద్ 53.27, 39.49 పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 149 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మలక్‌పేట డివిజన్‌కు డిసెంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి.
ఓటర్లు ఆసక్తి చూపకపోవడమే..
పోలింగ్ శాతం తగ్గేందుకు చాలా విశ్లేషణలు, ఆరోపణలూ తెరపైకి వస్తున్నాయి. అయితే, ఏది ఏమైనా.. ఓటర్లు ఆసక్తి చూపకపోవడమే ప్రధాన లోపమని చెప్పవచ్చు. కొవిడ్ భయం కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపిందని చెబుతున్నప్పటికీ.. కొవిడ్‌కి ముందు హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్‌తో పోల్చితే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ 70శాతంగా అంచనా వేస్తున్నారు. విద్యాసంస్థలు, థియేటర్లు మినహా చాలా వరకు ఓపెన్ అయ్యాయి. క్రమేణా ప్రజలు వారి వారి అవసరాల కోసం బయటకు వస్తున్నారు. వీరిలో 25శాతానికి పైగా మాస్కులు కూడా పెట్టుకోని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.
ఇక కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఈ ఎన్నికల ఏర్పాట్లు జరిగాయని యంత్రాంగం చెబుతోంది. సోషల్ డిస్టెన్సింగ్, శాటిటైజర్లు ఏర్పాటు చేశారు. అయినా ఓటర్లు ముందుకు రాలేదు. కొవిడ్ భయం అనేది కొంత ప్రభావం ఉండవచ్చు..కాని ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి కొవిడ్ ఒక్కటే కారణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు రాజకీయ పక్షాలు చేసుకుంటున్న ఆరోపణలు, తెరపైకి తీసుకొస్తున్న అంశాల విషయంలోనూ ఓటరు కొంత వెనక్కి తగ్గి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అభద్రతా భావం ఉందన్న విషయానికి వస్తే.. జంట నగరాల పరిధిలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్భయంగా ఓటు వేయండని పిలుపునిచ్చారు. యాక్టర్లు, వీఐపీలు, రాజకీయ నాయకులు కూడా పిలుపునిచ్చినా.. ఓటరు స్పందించలేదు.
చదువుకున్నవారిలో..
పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. పటాన్‌చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో ఎక్కువ నమోదైంది. కార్వాన్ , లంగర్ హౌస్ ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. ఇక సాఫ్ట్‌వేర్, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా ఉంటే దిల్‌సుఖ్‌నగర్, మాదాపూర్, అమీర్‌పేట, క్లాస్ ఏరియాగా పేరున్న బంజారాహిల్స్, మధురానగర్, జూబ్లీహిల్స్‌లోనూ తక్కువగా నమోదైంది. వరుస సెలవులు కావడంతో చాలామంది తమ సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
మరోవైపు పోలింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ కుట్ర చేసిందని, భయభ్రాంతులకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్‌లో ఆరోపణలు చేశారు. బయటకు వస్తే ఏం జరుగుతుందో అన్న భయాన్ని కల్పించారని ఆయన వ్యాఖ్యానించారు. కారణాలు ఏవైనా.. హైదరాబాద్ ఓటరు తమ పాలకులను ఎన్నుకోవడంలో నిర్లిప్తత కనబర్చారని చెప్పవచ్చు.
Must Read ;- బీజేపీ నోట.. మధ్యంతర ఎన్నికల మాట:సంచలన వ్యాఖ్యలు!











