పండుగలు, ఉత్సవాలు, గణతంత్ర వేడుకలు, బడ్జెట్ సమావేశాల ప్రారంభం వంటి కార్యక్రమాలతో జనవరి నెల వేగంగా గడిచిపోయిందని మోదీ గుర్తుచేశారు. కరోనా తర్వాత ప్రపంచంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయని, ఈ క్రమంలో.. భారత్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన దశాబ్దంలాగే కరోనా తర్వాత వచ్చిన ఈ దశాబ్దం కూడా చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు. అప్పట్లో భారత్.. కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని, కానీ.. ఇప్పుడు మాత్రం అలా ఉండబోదని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా మరిన్ని అవకాశాలను సృష్టించుకుని మరింతగా వృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Tune in. #MannKiBaat. https://t.co/kxQtvZ3byX
— Narendra Modi (@narendramodi) January 31, 2021
కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోందన్న ప్రధాని.. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీన్ని మిగిలిన రంగాలకు కూడా విస్తరిస్తామని, తయారీ రంగంలో భారత్ ను అగ్రభాగాన నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్పాదక రంగానికి కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కరోనా తెచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే.. కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గా వ్యవహరించిందని, ప్రస్తుతం వ్యాక్సినేషన్ లో కూడా దూసుకెళుతోందని ప్రధాని మోదీ తెలిపారు. కేవలం 15 రోజుల్లో 37 లక్షల మందికి టీకా అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు జరిగిన అవమానానికి యావత్ భారతం దుఃఖించిందని మోడీ పేర్కోన్నారు. మొదట్లో కాస్త తడబడిన మన భారత్ క్రికెట్ టీం.. చివరకు అద్భుతమైన విజయం సాధించారని చెప్పారు మోడీ. దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని పద్మ పురస్కారాలతో గౌరవించుకున్నామన్నారు. అలాగే పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన వారి గురించి ప్రత్యేకంగా వివరించారు మోడీ. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తీరును మోదీ అభినందించారు. హరియాణాలోని బదౌతి గ్రామంలో మురుగు నీటిని సాగునీరుగా మార్చుతున్న వైనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. కేరళలో రాజప్పన్ అనే దివ్యాంగుడు ఓ సరస్సును ప్లాస్టిక్ రహితంగా మార్చుతున్న తీరునుంచి అందరూ స్ఫూర్తి పొందాలని చెప్పుకొచ్చారు. ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర ప్రయాణాన్ని సాగించిన ఎయిరిండియాకు చెందిన మహిళా పైలట్ల సాహసాన్ని కొనియాడారు. వీరితోపాటు.. జబల్‌పూర్‌కు చెందిన కొందరు మహిళలు, కరోనా వల్ల ఉపాధి కోల్పోవడంతో రైస్ మిల్లును కొనుగోలు చేసి నడుపుతూ ఆదర్శంగా నిలిచిన తీరును ప్రధాని అభినందించారు. ఇలా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మరికొంత మందిక ప్రతిభ గురించి మన్ కీ బాత్ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకున్నారు ప్రధాని.
Must Read ;- టీమిండియా పోరాటం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ











