(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. అయితే, ఈ ఎన్నికల సందడి రాష్ట్రమంతటా ఉన్నా.. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం ఇంకా కనిపించడం లేదు. కారణం మొదటి దశలో ఇక్కడ ఎన్నికలు లేకపోవడమే.
విజయనగరం ప్రత్యేకం
రాష్ట్రంలో తొలి దశలో ఎన్నికలు జరగని ఏకైక జిల్లా విజయనగరం మాత్రమే. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ తొలి దశ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మరి విజయనగరం జిల్లాలో మాత్రమే ఎందుకు లేదంటారా.. అందుకూ కారణం ఉంది. విజయనగరం మినహా మొత్తం 12 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లోని పంచాయతీల్లో తొలిదఫాలో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతగా ఊపందుకోలేదు. అందుకే ఇక్కడ తొలి దశ కంటే.. మూడు, నాలుగో దశలో ఎన్నికలే బెటర్ అని ఎన్నికల సంఘం భావించింది. అయితే, విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీ అభ్యర్థన మేరకు భద్రతా ఏర్పాట్లు దృష్ట్యా రెండో దశకూ అవకాశం కల్పించారు. అందువల్ల 2,3,4 దశల్లో ఈ జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్నారు
విజయనగరంలో ఇలా ..
విజయనగరం జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు లేవు. రెండోదశలో 13న పార్వతీపురం డివిజన్‌లోని పంచాయతీలకు, 3వ విడతలో 17న విజయనగరం డివిజన్‌లోని పంచాయతీల్లో.. అలాగే, 4వ దశలో 21న విజయనగరం డివిజన్‌లోని గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి, గంట్యాడ, జామి, శృంగవరపుకోట, ఎల్‌కోట, వేపాడు, కొత్తవలస మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి.
రేపటి నుండి ఎస్ఈసీ ఉత్తరాంధ్ర పర్యటన
పంచాయతీ ఎన్నికలపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఫిబ్రవరి 1 నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రానున్నారు.1వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్‌ఈసీ మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరతారు. ఇక్కడ సాయంత్రం 4.30 గంటల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి విజయనగరం వచ్చి సాయంత్రం 7 గంటల నుంచి ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విశాఖ వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కాకినాడ నుంచి ఏలూరు చేరుకుని అక్కడ రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Must Read ;- ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు