కొత్తరకం కరోనా ప్రపంచమంతా కల్లోలం రేపుతుంది. భారత్‌లో కూడా ఈ కరోనా అడుగుపెట్టిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. లండన్‌లో మొదలైన కొత్తరకం కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ముందుజాగ్రత్త చర్యగా లండన్, అలాగే లండన్ నుంచి లింక్‌డ్ ఫ్లైట్స్ ద్వారా వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కి తరలిస్తున్నారు. కొవిడ్ పరిక్షని కచ్చితం చేశారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా సరే 7 రోజులపాటు ఐసోలేషన్ పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నెల 31 వరకు లండన్ విమానాలకు రద్దు చేసింది. అలాగే వారం రోజులగా లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులు వివరాలు సేకరించే పనిలో పడింది ప్రభుత్వం.
అప్రమత్తమైన రాష్ట్రాలు
ఢిల్లీ తర్వాత విదేశాల నుండి వచ్చే వాళ్లు ఎక్కువగా చేరుకునేవి ముంబై, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు. అందుకే ఈ రెండు ఎయిర్ పోర్ట్‌లోని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నెలలో 2291 మంది లండన్ నుండి వచ్చారని ప్రభుత్వాలు అంచనాలు వేస్తున్నాయి. వారి పూర్తి వివరాలు సేకరించి టెస్ట్‌లకు సన్నహాలు చేస్తున్నాయి. లండన్‌తో పాటు ఐరోపా దేశాల నుండి ప్రజలు ఎక్కువగా దేశానికి తరలివస్తుండడంతో ఆర్‌టిపిసిఆర్ చేసిన తర్వాతే అనుమతించాలని నిర్ణయించాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. త్వరితగతిన రిపోర్ట్ వచ్చే కిట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ ఆధీనంలో క్వారంటైన్‌కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా 7 రోజులపాటు ఐసోలేషన్ తప్పనిసరి చేశాయి ప్రభుత్వాలు.
Must Read ;- బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా.. మళ్లీ లాక్ డౌన్..
ఈ కొమ్ములు తిరిగిన కరోనాను ఆపెదెలా?
ప్రస్తుత వ్యాక్సిన్లు ఈ కొత్త కరోనా కొమ్ములు వంచగలవా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రష్యాలాంటి దేశాలు తమ టీకా కొత్త రకం కరోనాను కూడా ఆపగలదు అని వెల్లడిస్తున్నా కూడా అవి ప్రయోగాలపరంగా నిరూపితమైతే కానీ నమ్మలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాధన్ కొత్తరకం కరోనా గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం లండన్ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇది వ్యాపించిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తరకం కరోనా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి B.1.1.7 గా గుర్తిస్తున్నట్లు తెలియజేశారు.