శివసేన.. దేశంలో దుందుడుకుగా వ్యవహరించే పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. మహారాష్ట్రలో ఈ పార్టీకి ఉన్న పట్టు అలాంటింది. ప్రస్తుతం కాంగ్రెస్ తో పొత్తుకట్టి అధికారంలో ఉంది. మిత్రత్వంలో, వ్యవహారశైలిలో ఏమాత్రం తేడా వచ్చినా అన్నిరకాల మార్గాలను ఎంచుకుని ముప్పేట దాడి చేస్తుంది శివసేన. ఆ పార్టీ పత్రిక సామ్నాలో స్నేహం ఉంటే పూలవర్షం, విబేధిస్తే అగ్నివర్షం కురుస్తుంది. ఇదీ ఆ పార్టీ సహజశైలి. మహారాష్ట్రలో చాలా ఏళ్ల తరవాత ఆ పార్టీ సీఎం కుర్చీని దక్కించుకుంది. ప్రస్తుతం ఉద్దవ్ థాక్రే సీఎంగా ఉన్న మహారాష్ట్ర బీజేపీకి భారీ స్కెచ్ వేసిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ స్కెచ్ లో శివసేన సక్సెస్ కావచ్చు.. కాకపోవచ్చు.. కాని బీజేపీ ఫెయిల్ ఖావడం ఖాయమని చెబుతున్నారు. ఇందుకు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చింది శివసేన.
ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాలపై బెళగావి డివిజన్ (పాత పేరు బెల్గాం), కార్వర్, నిప్పని ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని, లేదా కేంద్ర పాలిత ప్రాంతాలను చేయాలని, అందుకు న్యాయపోరాటం చేస్తామని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్ గా కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ, సీఎం యడ్యూరప్పలు తీవ్రంగా స్పందించారు. అంగుళం భూమిని కూడా వదిలేది లేదని, ముంబైని యూటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నా.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
స్కెచ్ ఇదేనా..
తాజా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రలో అన్ని పార్టీలూ శివసేన నినాదంతో గొంతుకలపాల్సిన అవసరం తలెత్తింది. మహారాష్ట్రలోనూ గట్టి పట్టున్న బీజేపీకి మాత్రమే ఇది ఇబ్బందికరంగా మారనుంది. సదరు వివాదాస్పద ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని మహారాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తే.. కర్ణాటకలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరుకున పడుతుంది. ఎలాగూ మహారాష్ట్ర డిమాండ్ ను కర్ణాటక అంగీకరించదు. సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే పరిష్కార మార్గమని అన్ని పక్షాలకూ తెలుసు. కాని ప్రస్తుత వివాదం నేపథ్యంలో ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కర్ణాటకలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర బీజేపీతోపాటు మహారాష్ట్రలోని అన్ని పార్టీలనూ ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఒకరకంగా చెప్పాంటే.. రెండు రాష్ట్రాల్లోని బీజేపీలతోపాటు మొత్తం బీజేపీని ఇరుకున పెట్టినట్లు భావింవచ్చు. రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు అధికార శివసేన పార్టీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే.. బీజేపీ కచ్చితమైన హామీని కూడా మహారాష్ట్రకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మహారాష్ట్రలోని బీజేపీకే నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఉండగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా, జేడీ (ఎస్-సెక్యూలర్), కాంగ్రెస్ రెండుమూడో స్థానాల్లో ఉంటున్నాయి.
ఇక బెళగావి ప్రాంతంలో కాంగ్రెస్ కు పట్టుతగ్గింది. 2004 నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థి సురేష్ అంగడి వరుస విజయాలు సాధిస్తున్నారు. 2019లో 4లక్షల మెజార్టీతో గెలిచారు సురేష్. వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలవడంతో బీజేపీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. అయితే కరోనాతో ఆయన మృతి చెందడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమయింది. ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చే నష్టం లేదు. ఈ ప్రాంతంలో రెండో స్థానంలో ఉన్న, కర్ణాటకకే పరిమితై జేడీ (ఎస్ ) ఎలాగూ కర్ణాటక తరఫున పోరాడుతుంది. అటు మహారాష్ట్ర కోసం శివసేన, ఎన్సీపీ, ఇటు కర్ణాటక కోసం జేడీ (ఎస్) స్పష్టమైన పోరాటం చేయడం, కాంగ్రెస్ మధ్యేమార్గంగా వ్యవహరించే వ్యూహం అమలుచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎటొచ్చి బీజేపీకి ముందు నుయ్యి .. వెనుక గొయ్యి మాదిరిలా పరిస్థితి మారిందని చెప్పవచ్చు.
Must Read ;- అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?
ఇక వివాదం విషయానికి వస్తే..
గతంలో బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న, మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలైన బెళగావి, కార్వన్, నిప్పని ప్రాంతాలు మైసూర్ లో కలిశాయి 1956 దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అంతకుముందే వాటిని మైసూర్ లో కలిపారు. దీనిపై అప్పటినుంచి తమను మహారాష్ట్రలో కలపాలని బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాడుతోంది. 1956 ప్రాంతంలో ఈ ఉద్యం హింసాత్మకంగా మారింది. అప్పట్లో జరిగిన ఘర్షణల్లో దాదాపు 12మంది చనిపోయారు. ఏటా జనవరి 17న అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటోంది ఆ సమితి. ఇక ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మహాజన్ కమిషన్ ను ఏర్పాటుచేసింది. 1967లో ఆ కమిటీ నివేదిక ఇస్తూ.. బెళగావి ప్రాంతాలు కర్ణాటకలోనే ఉండేలా సిఫారసు చేసింది.
దీంతో మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. గతంలోనూ ఈ అంశానికి సంబంధించి రాజకీయ ప్రకటనలు వెలువడినా.. ఈ సారి ఏకంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించడం, కర్ణాటకనుంచి సీఎం, డిప్యూటీ సీఎం కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అది చాలదన్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఈ కేసు గెలిచేందుకు న్యాయపరంగా శక్తియుక్తులన్నీ ఉపయోగించాలన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే ఈ ఉద్యమానికి సారథ్యం వహించడం ఆహ్వానించదగిన పరిణామమని కామెంట్ చేయడం వివాదాన్ని మరింత పెంచింది. కర్ణాటక ఆక్రమించిన మరాఠీ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడానికి కట్టుబడి ఉన్నామంటూ ఇటీవల మహారాష్ట్ర సీఎంవో ట్వీట్‌తో ఈ వివాదం కొన్నాళ్ల క్రితం మొదలైంది. మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై రాజకీయపక్షాలు చేస్తున్న పోరాటం ఎటువైపు దారి తీస్తుందనేది చూడాలి.
Also Read ;- విసుగుచెందిన ప్రజలు.. 9 రోజుల్లో వంతెన నిర్మాణం..!











