(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఎస్.ఇ.సి ఆదేశించారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు.
నైతిక విలువలకు కట్టుబడి
పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు కూడా నైతిక విలువలకు కట్టుబడి జరగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ సూచించారు. తొలి దశ ఎన్నికలను రీషెడ్యూల్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, ఏపీ పంచాయతీ రాజ్ యాప్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలక్షన్ కాల్ సెంటర్ గా అది పనిచేస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తులు యాప్ ద్వారా మెసేజ్, వీడియో క్లిప్ పంపించవచ్చని ఆయన తెలిపారు. యాప్ లో అందిన ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు అధికారులు ఉంటారని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటువంటి విధానం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియతో వాలంటీర్లకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు. పంచాయతీ కార్యదర్శుల సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.
బ్యాలెట్ రెడీ
పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ పూర్తి అయిందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది వాక్సినేషన్ కు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపరచడం చేయాలని తెలిపారు.
ఎన్నికలకు సిద్ధం
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ తో చర్చించామని పేర్కొన్నారు సమావేశంలో డిఐజి ఎల్.కె.వి.రంగారావు, జాయింట్ కలెక్టర్లు సుమిత్, డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీఓలు ఐ కిషోర్, టివిఎస్జీ కుమార్, డిపిఓ వి.రవి కుమార్, జెడ్పి సిఇఓ లక్ష్మీపతి, ఎస్డీసిలు బి.శాంతి, కాశీ విశ్వనాథ రావు, పి.అప్పారావు, సిపిఓ ఎమ్.మోహన రావు, డిటిసి డా.వడ్డి సుందర్, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ, హౌసింగ్ పిడి టి.వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు , డివిజనల్ అభివృద్ధి అధికారి ఆర్.వి.రామన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!