Heroine Sneha Gears Down For Future Films After Her Re-Entry :
సినిమాల్లో కథానాయిక అందంగా కనిపించాలి .. అందాలు చూపించాలి అన్నట్టుగానే సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. పాటల్లోనూ .. రొమాంటిక్ సన్నివేశాల్లోను కథానాయిక అందాలతో సందడి చేయాలి. లేకపోతే ప్రేక్షకులు అసంతృప్తికి లోనవుతారు. అలాంటి పరిస్థితుల్లో స్కిన్ షో చేయకుండా అవకాశాలను అందుకోవడం .. స్టార్ హీరోయిన్ గా నెగ్గుకు రావడం అంత తేలికైన విషయమేం కాదు. అయినా సౌందర్య తరువాత ఆ తరహా నాయికగా స్నేహ మంచి పేరు తెచ్చుకుంది. శ్రీదేవి .. సుహాసిని తరువాత అందమైన నవ్వు కలిగిన హీరోయిన్ గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
‘తొలివలపు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన స్నేహ, ‘ప్రియమైన నీకు’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కథ .. కథనం .. సంగీతంతో పాటు ఆమె అందం ఆ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. తమిళంలో ఆమె ఎక్కువ బిజీగా ఉండటం వలన తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయింది. చేసిన సినిమాల్లో ‘వెంకీ’ .. ‘రాధాగోపాళం’ .. ‘శ్రీరామదాసు‘ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
వివాహమైన తరువాత స్నేహ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో కేరక్టర్ ఆర్టిస్ట్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఉపేంద్ర భార్య పాత్రలో ఆమె మెప్పించారు. ఆ తరువాత ‘వినయ విధేయ రామ‘ సినిమాలో చరణ్ కి వదినగా బరువైన పాత్రలో నటించారు. దాంతో ఇక ఈ తరహా పాత్రలలో స్నేహ చాలా బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఆ తరువాత ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. మరి స్నేహ వరకు అవకాశాలు వెళ్లడం లేదా? ఆమె చేయాలనుకోవడం లేదా? అనేదే అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.
Must Read ;- రీ ఎంట్రీలోను అదే గ్లామరు .. అదే జోరు