(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కేడర్ ఫుల్ జోష్‌లో ఉండాల్సింది పోయి అసహనంతో కొట్టుమిట్టాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు సైతం అసహనంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అయినప్పటికీ తామేమీ చేసుకోలేకపోతున్నామని, తమ అనుచర గుణానికి లబ్ధి చేకూర్చలేకపోతున్నామని అంతరంగుల దగ్గర మధనపడుతున్నట్లు వినికిడి.
క్రమశిక్షణకు మారుపేరుగా ..
క్రమశిక్షణకు మారుపేరుగా, అధినాయకుడు మాటే శాసనంగా ఉంటూ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి. కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ స్థాపించిన జగన్ అప్పటి నుంచి అలుపెరగకుండా పోరాడుతూ, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చివరికి 16 నెలల జైలు జీవితం గడిపి మరి ఈ స్థాయికి వచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కాలి బాటన రాష్ట్రం అంతా పర్యటించి.. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అంటూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసి, ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చేయగలగడంతో జగన్ కొంతవరకు సక్సెస్ అయ్యారు.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?
కేడర్లో కొరవడ్డ ఉత్సాహం ..
పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు జగన్ వెంట నడిచిన ఎంతోమంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. అయితే వారెవరిలోనూ గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఎవరూ ఉండటం లేదు. ఎవరైతే జగన్ కోసం కష్టనష్టాలను అనుభవించి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు వారే జగన్‌ను బహిరంగంగా తిట్టే స్థాయికి పరిస్థితి దిగజారినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే విశాఖ జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలకు దిగడం, గోదావరి జిల్లాలోని పి గన్నవరం ఎమ్మెల్యే , అమరావతి ఎమ్మెల్యే వంటి వారు చాలామంది ఇప్పుడు తమ అసంతృప్తిని బయటకు వెళ్లగక్కుతుండటం అందుకు బలం చేకూర్చుతోంది.
మంత్రులు సైతం ..
రాష్ట్ర మంత్రులు సైతం అప్పుడప్పుడు నోరుజారి పార్టీ విధానాలను తప్పు పడుతున్న సంఘటనలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం .. క్షేత్ర స్థాయిలో ఎక్కడా నాయకుల ప్రమేయం లేకుండానే మొత్తం వాలంటీర్లు, అధికారుల ద్వారా పరిపాలన సాగుతూ ఉండటం, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు డమ్మీలుగా మారడం, కోట్లాది రూపాయలు కుమ్మరించి ఎన్నికల్లో గెలిచినా, ఆ సొమ్ములు రాబట్టుకునే అవకాశం లేకుండా చేయడం, జగన్ అప్పాయింట్‌మెంట్ ఎవరికి దక్కకపోవడం ఇలా ఎన్నో అసంతృప్తుల తో పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారాలు మరింత ముదరక ముందే వైసీపీ మేల్కొంటుందో లేదో వేచి చూడాలి
Also Read ;- ఆధిపత్య పోరులో అభివృద్ధి మరిచారు.. ఉత్తరాంధ్ర వాసుల ఆవేదన