పంచాయతీ కార్యదర్శులు అసలు ప్రభుత్వ ఉద్యోగులా? లేదంటే ప్రైవేటు ఉద్యోగులా? లేదంటే.. ఈ రెంటికీ మధ్యలో ప్రైవేటు సంస్థలకు అక్కరకొచ్చే పని చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఉద్యోగులా?.. అనే కొత్త చర్చ ఇప్పుడు ఏపీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల్లో 12 మందికి జగన్ సర్కారు నోటీసులు జారీ చేసింది. కారణమేంటో తెలుసా?.. ఈ 12 మంది పంచాయతీ కార్యదర్శులు అమూల్ సంస్థకు రైతుల నుంచి పాల సేకరణలో సహకరించకపోవడమేనట. అయినా ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీకి పాలు పోయించడంలో నిర్లక్ష్యం వహించారంటే అర్థముంటుందేమో గానీ.. ప్రైవేట్ డెయిరీ అయిన అమూల్ కు పాలు పోయించే విషయంలో వీరు నిర్లక్ష్యం వహించారంటూ నోటీసులు జారీ చేయడమే వింతగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
అమూల్ సంస్థ కోసం పాలను సేకరించడం లేదంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్లో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కేశవరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అమూల్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. గ్రామాల్లో రైతుల నుంచి పాల సేకరణ విషయంలో పంచాయతీలకు కార్యదర్శులే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఆ బాధ్యతల్లో వారు ప్రభుత్వ రంగంలోకి విజయా డెయిరీకి పాలు సేకరించే బాధ్యతలు చేపట్టాలా? లేదంటే ప్రైవేటు రంగానికి చెందిన అమూల్ సంస్థకు పాలు సేకరించే పని చేపట్టాలా? ఇక్కడే అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ అయోమయం నెలకొంది. తన రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ప్రైవేటు డెయిరీలను నాశనం చేసేందుకే సీఎం జగన్ అమూల్ డెయిరీని రాష్ట్రానికి తీసుకువచ్చారన్న ఆరోపణలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. అయినా ప్రైవేట్ డెయిరీలను మూత పడేలా చేయాలంటే.. ప్రభుత్వ రంగంలోకి విజయా డెయిరీని బలోపేతం చేస్తే సరిపోతుంది కదా. అది మరిచిన జగన్ సర్కారు అమూల్ ను రాష్ట్రానికి ఆహ్వానించడం, దానికి పాలు పోయించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించడం, ఆ మేరకు పని చేయలేదంటూ పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం నిజంగానే విడ్డూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ జమానాలో ప్రజాస్వామ్యం ఖూనీ











