గ్రేటర్‌లో ఎన్నికల హీట్ పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగానే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు ఎంత వరకైనా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని పార్టీ నాయకులకు, కేడర్‌కు చెబుతున్నారు. దీంతో ఛాన్స్ దొరిగితే చాలు ఇతర పార్టీలపై విరుచుకు పడుతున్నారు. పార్టీ అధ్యక్షుల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేతలు అవతలి పార్టీలను నైతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకు మాటల తూటాలు పేలుస్తున్నారు. నామినేషన్ల సమయంలోనే ఈ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయంటే రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో అంటున్నారు రాజీకీయ విశ్లేషకులు.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల మధ్య ఓ ఫేక్ లెటర్ అగ్నికి ఆజ్యం పోసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాసాడని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే తాను ఆ లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మీడియా ముఖంగా ఆయన సంతకం ఎలా ఉంటుందో చూపిస్తూ కేసీఆర్ అబద్దపు ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. లేఖపై చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. ఫేక్ లెటర్లు విడుదల చేసి తమను బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి బీజేపీ పేదల పొట్ట కొట్టిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
Must Read ;- కేసీఆర్ స్కెచ్ ప్రకారమే.. జనసేన బరిలో ఉంటోందా?
ఫోర్జరీ లేఖలంటూ సంజయ్ సీరియస్
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోర్జరీ లేఖలు రిలీజ్ చేయడంపై బండి సంజయ్ సీరియస్‌గా స్పందించారు. గతంలో కేసీఆర్‌పై ఉన్న కేసులను ఆయన గుర్తు చేసారు. ఫేక్ పాస్ పోర్టులను తయారు చేసే వారికి ముఖ్యమంత్రి పదవి అప్పజెపితే ఇంతకంటే ఇంకేం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ లేఖను విడుదల చేసిన ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , డీజీపీ కలుగ జేసుకుని ప్రగతి భవన్‌లోఉన్న ముఖ్యమంత్రిపై విచారణ జరిపించాలన్నారు. బీజేపీని గెలిపిస్తే గ్రేటర్‌లో కత్తులతో జీవించాల్సి వస్తుందని.. నిరంతరం అభద్రతతో బ్రతకాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం మరింత దుమారం రేపింది. టీఆర్ఎస్‌కు ఓటేస్తే పతంగికి ఓటేసినట్టే అని .. ముఖ్యమంత్రి కేసీఆర్ అసుదొద్దీన్ ఓవైసిని ప్రగతీ భవన్‌లో , సచివాలయంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, గ్రేటర్ వాసులు ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మొదలైన మాటల తూటాలు ఎటువైపు వెళ్తాయో.. ఏ గూటికి చేరతాయో వేచి చూడాలి.
Also Read ;- హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమల దళం!