పవన్ కల్యాణ్ రాజకీయాలలో అడుగుపెట్టిన తరువాత, సినిమాలపై దృష్టిపెట్టలేదు. దాంతో బాగానే గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ఆయన తన మనసు మార్చుకుని, రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. రీ ఎంట్రీలో ఆయన తొలి సినిమాగా ‘వకీల్ సాబ్‘ నిర్మితమైంది. గతంలో హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘పింక్’ సినిమాకి ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. బోనీకపూర్ కూడా ఈ సినిమాకి భాగస్వామిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‘ అనే మలయాళ మూవీ రీమేక్ లోను పవన్ చేస్తున్నాడు. మలయాళంలో క్రితం ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ లో రానా కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను ‘వినాయకచవితి’ కానుకగా సెప్టెంబర్ 9వగా తేదీనగానీ .. 10వ తేదీనగాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే సెప్టెంబర్ 9వ తేదీన ‘లైగర్‘ను విడుదల చేస్తున్నట్టుగా ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘వినాయక చవితి’కి ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందేమో చూడాలి మరి.
ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలోను పవన్ ఒక సినిమా చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగానే దీనిని ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, జాక్విలిన్ ఒక ముఖ్యమైన పాత్రలో మెరవనుంది.వజ్రాల దొంగ ‘వీరమల్లు’గా ఈ సినిమాలో పవన్ కనిపించనుండటం .. తొలిసారిగా ఆయన చారిత్రక చిత్రం చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ ఇక సినిమాలు చేయడనుకుని నిరాశపడిన వాళ్లంతా, ఇప్పుడు ఆయన జోరు చూసి షాక్ అవుతున్నారు.
Must Read ;- పవన్ పవర్ చూపించనున్న హరహర మహాదేవ











