రూ.300కోట్లతో పిల్లల ఆసుపత్రి ఉచితంగా కట్టిస్తామని దాతలు ఎవరైనా ముందుకొస్తే ఏ ప్రభుత్వమూ వద్దనదు. ఏ పాలకవర్గం కాదనదు. కాని ఆ విరాళం ఇచ్చే వ్యక్తికి సంబంధించి నిబద్ధత, సమర్థత కచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా.. కేవలం హామీని నమ్మేసి ఒప్పందం కుదుర్చుకోవడం, భూమి పూజకు సిద్ధమని ప్రకటించాక..తీరా సదరు దాతకి అంత సమర్థత లేదనే అనుమానం వస్తే.. అపహాస్యం మూటగట్టుకోవాల్సి వస్తుంది. టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డికి అదే జరిగింది.
గుడ్డిగా ఎలా నమ్మారు..!
ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో రూ.300 కోట్లతో చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించేందుకు ముందుకొచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. అసలు ఆ కంపెనీ వివరాల్లోకి వెళితే.. ఆ కంపెనీ పేరుతో ఉన్న ఆస్తులు కనీసం అందులో 1వ వంతుకూడా లేదు. ఆ కంపెనీ డైరక్టర్ సంజయ్ కె సింగ్ తిరుమల వచ్చి ఛైర్మన్, ఈఓతో భేటీ కావడం, వెంటనే విరాళానికి సంబంధించిన ప్రకటన రావడం జరిగిపోయాయి. ఆ సంస్థ వెబ్ సైట్ చూస్తే..చాలా ప్రాజెక్టులు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థకు వచ్చిన ఆదాయం రూ.49,900 మాత్రమే. ఆ ఆర్థిక సంవత్సరంలో వ్యయం రూ.1.25లక్షలు కాగా నష్టం రూ.75వేలు ఉంది. ఆ ఒక్క సంవత్సరం నష్టాలు రావచ్చు కదా అనే ప్రశ్నకూడా తలెత్తుతుంది. అయితే ఈ కంపెనీ 2017లో ఇన్ కార్పొరేట్ అయింది. సంజయ్, వర్దన్ ఇద్దరు డైరక్టర్లు ఉన్నారు.
సంజయ్ కేథర్ నాథ్ సింగ్ మూడు కంపెనీల్లో డైరక్టరుగా ఉన్నారు. దేవాంతి టూరిజం అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, మహాదత్ ప్రీసియస్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు డైరక్టర్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు ఆరునెలల క్రితం ఏర్పాటయ్యాయి. వీరిద్దరే డైరక్టర్లుగా కొనసాగుతున్నారు. మరి ఇలాంటి కంపెనీ డైరక్టర్ రూ.300కోట్ల విరాళం ప్రకటిస్తున్నారంటే.. కనీస ప్రొఫైల్ చెక్ చేసినా పలు అనుమానాలు తలెత్తున్నాయి. పదినిమిషాల పాటు ఆన్‌లైన్‌లో వెతికితే ఎంతోకొంత సమాచారం వస్తుంది. కాని ఆయన ఇచ్చిన హామీని మాత్రమే ఎలా నమ్మారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రి నిర్మాణం కోసం పదెకరాల భూమిని కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read ;- పింక్ డైమండ్ కేసులో విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు షాక్
అనేక అనుమానాలు..
ఆలయాలకు లేదా ఆధ్యాత్మిక సంస్థలకు ఏక మొత్తంలో గుట్టుగా (ఆభరణాలు, నగదు) విరాళాలు ఇచ్చే విషయం బయటి వారికి తెలియకపోవచ్చు. కాని భూములు, చెక్‌లు, ఇతర నిర్మాణాల విషయంలో కచ్చితంగా వివరాలు తెలుస్తాయి. అంతేకాదు.. ఆ విరాళం స్వీకరించేందుకు కూడా కొన్ని నియమాలుంటాయి. చాలాచోట్ల ఇది అమలు అవుతోంది. కేరళలోని ఓ ఆలయానికి వజ్రాల వ్యాపారి రూ.500కోట్ల విరాళం ఇచ్చేందుకు సిద్ధమైతే.. అక్కడి ఆలయ పాలకవర్గం ఆ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలని, అప్పుడే తాము విరాళాన్ని అంగీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ విరాళం హోల్డ్‌లో ఉంది. న్యాయపరమైన సలహాలను అక్కడి హైకోర్టు నుంచి సదరు ఆలయ పాలకవర్గం స్వీకరించింది.
మరి అలాంటిది కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల ఆలయానికి సంబంధించిన టీటీడీ ఆధ్వర్యంలో రూ.300కోట్లతో పిల్లల ఆస్పత్రి నిర్మిస్తామనగానే ఎలా నమ్మారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ప్రస్తుతం బయటకు వస్తున్న విషయాలు కాకుండా సంజయ్ కేదర్ నాథ్ సింగ్ నిజంగానే విరాళం ఇస్తారా..వేరే సంపాదన ఏమైనా ఉందా.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ భూములు కేటాయించాక..నిర్మాణం జరగకపోతే.. గతంలో ‘ఫోక్స్ వాగన్ ’కంపెనీ వ్యవహారం మాదిరిగా లావాదేవీలు జరిగి..ప్రభుత్వ ఖజానాకే రివర్స్‌లో గండి పడిన సంఘటన గుర్తుకు వస్తోంది. అప్పుడు సంబంధిత బాధ్యులు ‘సొమ్ములు పోనాయి..మరేటి చేత్తాం’ అన్నట్లుగా మారితే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.
Must Read ;- ఓటర్లకు తిరుమల లడ్డూలు పంపిణీ..!