Huge Welcome To MP Santosh Kumar :
రోడ్డుకు ఇరు వైపులా కిలో మీటరు మేర.. ఇద్దరు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా 2 వేల మంది.. అంతా మహిళలే.. వారిలో కొందరు వృద్ధులు కూడా.. చేతుల్లో పూల మొక్కలతో గంటల తరబడి అలా నిలుండిపోయారు.. ఏకంగా కిలో మీటరు మేర ఇలాంటి దృశ్యమే.. ఎందుకు?.. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికో కాదు. ఓ ఎంపీకి స్వాగతం పలికేందుకట. నిజమా?.. అయితే ఆ ఎంపీది ఎంత పెద్ద రేంజో కదా అనుకుంటున్నారా? అంత సీనేమీ లేదు. ఆ ఎంపీ కూడా ఇతర ఎంపీల మాదిరే ఓ రాజ్యసభ సభ్యుడు. అయితే ఆయన అధికార పార్టీకి చెందిన వారట. ఇంకేముంది.. ఆయనకు స్వాగతం పలికేందుకు ఓ మంత్రిగారు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకానుకున్నారు.
మంత్రి గారి ఆదేశాలు మరి..
అనుకున్నంతనే.. రోడ్లపై గంటల తరబడి నిలబడే పార్టీ కార్యకర్తలు ఎవరు ఉంటారు? ఏ కార్యక్రమానికైనా కాదు.. కూడదని.. విధిలేని పరిస్థితుల్లో హాజరయ్యేది అంగన్ వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులే కదా. ఈ మంత్రిగారు కూడా వారినే ఆశ్రయించారు. ఆశ్రయించారనే కంటే.. ఆదేశాలు జారీ చేశారంటే బాగుంటుందేమో. అసలే మంత్రి హుకుం.. ఆపై ఎంపీ గారు వస్తున్నారాయే.. ఇంకేముంది కిమ్మనకుండా మంత్రిగారు చెప్పినట్లుగా ఏకంగా 2 వేల మంది మహిళలు ఎంపీగారికి స్వాగతం పలికేందుకు రోడ్డుపై బారులు తీరారు.
ఓపెన్ టాప్ జీపులో ఎంపీ, మంత్రి..
అమితాసక్తితో పాటుగా పెద్ద ఎత్తున విమర్శలకెఉ దారి తీసే ఈ ఘటన ఎక్కడ జరిగింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ అదిరేటి స్వాగతం కనిపించింది. సోమవారం నాడు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పాలమూరు పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఎంపీ గారికి అదిరేటి స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 2 వేల మంది మహిళలు.. చేతుల్లో పూల మొక్క్లలు పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా అలా గంటల తరబడి నిలుచుండిపోయారు. వారి మధ్యలో నుంచి ఎంపీ గారిని మంత్రి గారు అలా ఓపెన్ టాప్ జీపులో తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
కేటీఆర్ కు కూడా ఇలాగేనట..
ఈ తరహా వెల్ కమ్ కు ఇదే తొలిసారేమీ కాదు. ఇదే తరహాలో టీఆర్ఎస్ కార్యదక్షుడు, మంత్రి కేటీఆర్ కు కూడా ఘన స్వాగతం లభించింది. పాలమూరు జిల్లాకు పొరుగునే ఉన్న నారాయణ పేట జిల్లాకు కేటీఆర్ ఈ నెల 10న వెళ్లారు. ఆ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికేందుకు అక్కడి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.. ఇదే తరహాలో భారీ సంఖ్యలో మహిళలను రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి కేటీఆర్ కు దండాలు పెట్టించారట. ఈ రెండు కార్యక్రమాలను చూసిన వాళ్లంతా ఈ స్వాగతంలో అన్నీ ఓకే గానీ.. పొర్లు దండాలొక్కటే తక్కువ అన్న కామెంట్ చేస్తున్నారు.
Must Read ;- అదిరేటి లాజిక్ తో కేసీఆర్‌పై ఆ ఎంపీ అటాక్