బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళుతున్న అమరావతి రాజధాని మహిళా రైతులను పోలీసులు ప్రకాశం బ్యారేజీపై అడ్డుకున్నారు. దీంతో బ్యారేజీపై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దుర్గ గుడికి బయలు దేరిన మహిళలను అరెస్టు చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు. రాజధాని మహిళలను అడ్డుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించడంతో బ్యారేజీపై రెండు గంటల సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై ఆందోళనకు దిగిన మహిళా రైతులను బలవంతంగా లాగడంతో కొందరి మహిళల బట్టలు కూడా చిరిగిపోయాయి. రాజధాని మహిళల అక్రమ అరెస్టులకు నిరసనగా అమరావతి రాజధాని గ్రామాల రైతులు సచివాలయం ముట్టడికి బయలు దేశారు. దీంతో రాజధానిలో పలు గ్రామాల రైతులు సచివాలయం దిశగా కవాతు ప్రారంభించారు. వారిని పోలీసులు బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మందడంలో..
అమరావతి రాజధాని గ్రామం మందడంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మహిళల వద్ద నుంచి పోలీసులు వాటర్ బాటిళ్లు లాక్కుని డ్రైనేజీలో పడేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తమను అరెస్టు చేస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ మహిళా రైతులు హెచ్చరిస్తున్నారు. రైతుల వద్ద నుంచి పురుగు మందుల డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలాది మంది మహిళా రైతులు రాజధానిలోని వెలగపూడి సచివాలయం దిశగా కవాతు ప్రారంభించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
Must Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం