ఫోన్ రింగవ్వగానే మామూలు కాలే కదా అనుకున్నాడు. కానీ ఫోన్ ఎత్తగానే.. అవతలి వ్యక్తి బూతు పురాణం మొదలు పెట్టాడు. ఎడతెరిపి లేకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ‘వెంటనే పోలీస్ స్టేషన్‌కి రా.. లేకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ పోలీసులు బెదిరించడంతో భయపడిపోయిన ఆ వ్యక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్ కూడా వేయకుండానే ఊరొదిలి పారిపోయాడు. అయినా సరే పోలీసుల బెదిరింపులు ఆగలేదు. ఇక భరించలేక ఆఖరికి ఎన్నకల కమిషన్ ని ఆశ్రయించాడు గుంటూరులోని చుండూరు పంచాయతీకి చెందిన బాలకోటి రెడ్డి.
బెదిరిస్తున్న పోలీసులు
పంచాయతీ ఎన్నకల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమైన తనపైన కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించారనీ, బూతులు తిట్టారని.. చివరకు వాళ్లు పెట్టే బాధలు తట్టుకోలేక నామినేషన్ వేయకుండానే ఊరి వదిలి వెళ్లిపోయినా కూడా వదలకుండా వేధిస్తున్నారని ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు బాలకోటి రెడ్డి. ఈ విషయమై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. తన ఫిర్యాదులో పోలీసుల కాల్ డేటా, ఫోన్ సంభాషణలను కూడా జత చేసినట్లు తెలుస్తుంది.
మీరు మారరా..
బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులను సహించబోమని ఇప్పటికే పేర్కొన్న ఎస్‌ఈసీ, ఈ ఫిర్యాదు విషయంలో ఏ విధంగా స్పందించనుందో చూడాలి. ఎన్నికల విషయంలో ఎలాంటి అవకతవకలను సహించబోనని చెప్తున్న నిమ్మగడ్డ దీనిపై చర్యలు తీసుకుంటారని బాధితులు ఆశిస్తున్నారు. కాపాడాల్సిన పోలీసులే.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ప్రభుత్వ ప్రతినిధుల్లా ప్రవర్తిస్తున్నారనీ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే.. మేమింతే.. మా ప్రవర్తనలో మార్పు రాదంతే.. అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. భక్షకులు మారితే.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి ఏపీ లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Must Read ;- సీఎం డైరెక్షన్, పోలీసుల ఓవర్ యాక్షన్.. వ్యూహాత్మకంగా అచ్చెన్న అరెస్ట్