వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దేశంలో అన్నదాతల ఉసురు పోసుకుంటున్న నల్ల చట్టాల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు అనుకూలంగా ఉంది.. రైతుల పక్షాన నిలబడి వారికి వెన్నుదన్నుగా ఉందా? ఈ విషయంలో ఇదమిత్థంగా ఒక అభిప్రాయానికి రావడం కష్టం. ఎందుకంటే ఈ విషయంలో వారు తొలినుంచి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు. గోడమీది పిల్లి వాటం చూపిస్తున్నారు. ఎలాగంటే..
కేంద్రం తీసుకువచ్చిన దుర్మార్గమైన వ్యవసాయ మార్కెటింగ్ బిల్లులను తొలుత పార్లమెంటు ఎదుట ప్రవేశపెట్టినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటికి జై కొట్టారు. ఆ బిల్లులు చట్టాలుగా మారి దేశంలో రైతన్న బతుకు అస్థిరం కావడానికి వారు కూడా తమ వంతు తోడ్పాటు అందించారు. కేంద్రంలోని బీజేపీని తమ ఎడల ప్రసన్నం చేసుకోవడానికి వారు అనుసరించే అనేకానేక మార్గాల్లో అది కూడా ఒకటి అయి ఉండొచ్చునని అంతా అనుకున్నారు. అయితే.. ఆ తర్వాత దేశంలో పెల్లుబికిన అసంతృప్తి, అన్నదాతల ఆగ్రహావేశాల నేపథ్యంలో వారిలో కొంత భయం వచ్చింది. అలాగని.. రైతులకు జై కొట్టి.. కేంద్ర చట్టాలను నిరసించేంత, తమ రాష్ట్రంలో అమలు చేయం అని చెప్పేంత తెగువ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. కానీ, రైతు పక్షపాత నాయకుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడానికి.. భారత్ బంద్ కు రాష్ట్రంలో ప్రభుత్వం ‘అనుమతి’ ఇచ్చింది. అంతమాత్రాన ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని జగన్ సర్కారు పొందలేకపోయింది.
Must Read ;- ‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ
తాజాగా జై కొట్టడం ఎలా జరుగుతోందంటే..
ఆ తర్వాత.. రాష్ట్రప్రభుత్వం కేంద్రం తెచ్చిన నల్లచట్టాల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నదనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారు.
తాజాగా జగన్మోహన్ రెడ్డి అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్టుగా చేసిన ఒక ప్రకటన.. కాస్త లోతుగా పరిశీలించే వారికి కొత్త భయాలను కలిగిస్తోంది. ప్రత్యేకంగా రైతన్నలకోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఈ ప్రకటన చూడగానే.. రైతులోకం జగనన్నను కీర్తించేస్తారని వారి పార్టీ అనుకోవచ్చు. ఇప్పటిదాకా కోరలులేని, కేవలం బుసకొడుతున్న వ్యవహారం లాంటి దిశ చట్టానికి కూడా రాష్ట్రంలో పోలీసు ప్రత్యేక స్టేషన్లున్నాయి. కానీ.. మహిళలపై అకృత్యాల విషయంలో సాధించిన పురోగతి శూన్యం. అదే మాదిరిగా ఇప్పుడు రైతుల కోసం పోలీసు స్టేషన్లు అంటున్నారు.
ఈ రైతు స్టేషన్ల మాట రాగానే.. కొత్త భయాలు పుడుతున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్ లోనూ రైతులకోసం ఒక స్పెషల్ డెస్క్ ఉంటుందింట. ఇవన్నీ.. జిల్లాకు ఒకటిగా ఉండే పోలీసు స్టేషన్లతో అనుసంధానం అవుతాయట. రైతు సమస్యలను పరిష్కరిస్తాయట. ఈ ఏర్పాటుగురించి ప్రకటిస్తూ.. సమీక్ష సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటే మనకు ఆయన వైఖరి అర్థమవుతుంది.
‘వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి దేశంలోని చాలా ప్రాంతాలకు రైతులు వెళ్తారు. అక్కడ ఏదైనా ఇబ్బందులొస్తే చట్టపరంగా రక్షణ వ్యవస్థ నిలబడాలి. రైతులు మోసాలకు గురికాకుండా చూడాలి. ఎంత త్వరగా స్పందించి అండగా నిలుస్తామనేది ముఖ్యం’ అంటూ సుద్దులు చెప్పారు.
పాయింట్ బాగానే కనిపిస్తోంది గానీ.. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయబోయే ఈ రైతు పోలీసుస్టేషన్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ ఇష్టానుసారం వ్యవహరించగల అధికారం ఉంటుందా? అనేది ఒక ప్రశ్న. అంతకంటె మించినది ఏంటంటే.. ఈ నిర్ణయం ద్వారా.. కేంద్రం తెచ్చిన నల్ల వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను జగన్ ఆమోదిస్తున్నట్టు తేలిపోయింది. రైతులు అమ్మకాలకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తారు.. వారికి అండగా నిలబడాలి.. అనే మాటల్లోని అంతరార్థం ఇదే. అందమైన మేలిముసుగు తొడిగి ఆయన స్వీటుగా చెప్పారు.
మొత్తానికి రాష్ట్రంలోని రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసినట్టే అని తేలిపోయింది. కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో ఆయనేమీ వారికి అండగా ఉండబోవడం లేదు. వారి చావు వారి చావాల్సిందే. పైగా ప్రభుత్వాలు రైతుల బాధ్యతనుంచి ఎప్పుడెప్పుడా అని తప్పించుకోవడానికి చూస్తున్నాయి. ఈ రైతు పోలీసుస్టేషన్లు అనే మేలు చేసే నిర్ణయం ద్వారా.. పరోక్షంగా కేంద్ర చట్టాలకు జై కొట్టేస్తున్నారు. అంతకంటె పరోక్షంగా.. కొనుగోళ్లకు గ్యారంటీ ఇచ్చే మార్కెటు యార్డుల వ్యవస్థ మొత్తం రూపుమాసిపోనుంది. కొత్త వ్యవసాయ నల్ల చట్టాల వల్ల రైతులు ఏయే భయాల్లో మునిగిపోతున్నారో.. అవన్నీ రాష్ట్రాలో కళ్ల ముందుకు రానున్నాయి. కానీ.. జరగబోయే నష్టాన్ని రైతులోకం గుర్తించకుండా.. వారి చేతిలో తాయిలం పెడుతున్నట్లుగా.. వారిని మాయ చేస్తున్నట్లుగా.. చట్టాలనుంచి కాపాడే రైతు పోలీసు స్టేషన్ల ఏర్పాటు గురించి జగన్ ప్రకటిస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల్లో కలుగుతోంది.
నిజానికి నల్లచట్టాలు అమల్లోకి వస్తే.. రైతులకు వచ్చే సమస్యలను, లీగల్ వివాదాలను రైతుల కోణంలోంచి పరిష్కరించే ఏర్పాటు ఏదీ పద్ధతిగాలేదు. ఆ చట్టాలను రైతులు అసహ్యించుకోడానికి అది కూడా ఒక కారణం. అయితే.. ఆ భయాలన్నింటినీ మాయ చేస్తూ జగన్ రైతు పోలీసుస్టేషన్లు అనే బిస్కట్ వేస్తున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.
Also Read ;– రైతుల అదృశ్యం, ఖాకీలకు భద్రత లేదు.. అసలేం జరుగుతోంది?