తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యూహాత్మకంగా జరిగినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం తగ్గించేందుకు, ముఖ్య నాయకుల అరెస్టుల ద్వారా పార్టీ కేడర్లో ఒకరకమైన మానసిక ఆందోళన, ఒత్తిడి కలిగించేందుకు వ్యూహాత్మకంగా అధికార వైసీపీ వ్యవహరించినట్లు టీడీపీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ఇదంతా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల డైరెక్షన్‌లోనే జరిగిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీకి నిమ్మాడలో కార్యకర్తలు కూడా లేరు
నిమ్మాడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామం .. గత 34 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా అచ్చెన్న కుటుంబ సభ్యుల పాలనలోనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడను వైసీపీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే .. వైసీపీకి నిమ్మాడలో కార్యకర్తలు కూడా లేని పరిస్థితి. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం రెండు వేల రెండు వందలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా టీడీపీకి అక్కడి గ్రామస్తులు ఓట్లు వేస్తుంటారు. అలాంటి చోట వైసీపీ మద్దతుదారుగా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కానీ.. కింజరాపు కుటుంబంలో వైసీపీ విభేదాలను సృష్టించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కింజరాపు కుటుంబంలో వైసీపీ చిచ్చు
ఎర్రన్నాయుడు సోదరుని కుమారుడు కింజరాపు అప్పన్న అనే యువకుడ్ని వైసీపీ టెక్కలి ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. దాంతో ఆయన పంచాయతీ బరిలో ఉండటానికి సిద్ధపడినట్లు వినికిడి. నామినేషన్ వేయనివ్వరని గుర్తించి.. దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడకు బయట నుంచి వ్యక్తుల్ని తీసుకుని వచ్చి హల్ చల్ చేశారని సమాచారం. ఇదిలావుండగా.. అప్పన్న తమ మాట వినడం లేదని.. అచ్చెన్నే నచ్చచెప్పాలని.. ఆయన ఇంటికి అప్పన్న తండ్రి ,సోదరుడు వెళ్లారు. ఆ సమయంలో ఫోన్ చేసి అచ్చెన్న మాట్లాడారు. అందులో ఎక్కడా బెదిరించినట్లుగా లేనప్పటికీ.. బెదిరించారంటూ కేసు పెట్టారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇక అప్పన్న కూడా అప్పట్నుంచి గ్రామంలో లేరని తెలిసింది. ఆయన వైసీపీ నేతల సమక్షంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- అచ్చెన్నపై పితూరీ : మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు!
మంత్రి కృష్ణదాస్‌కు సీఎం క్లాస్ ..
నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కింజరాపు అప్పన్న నామినేషన్ వేసిన రోజు ఆయనకు మద్దతుగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ వెళ్లి తెలుగుదేశం శ్రేణులతో బాహాబాహీకి దిగినప్పటికీ .. అక్కడికి అందుబాటులోనే ఉన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కల్పించుకోకపోవడంతో .. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సీఎం .. కృష్ణ దాస్‌కు ఫోన్ చేసి తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ .. ధర్మాన కృష్ణదాస్ తదితరులతో గ్రూప్ కాల్లో మాట్లాడిన సీఎం కృష్ణదాస్ నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టినట్లు .. ఇలానే కొనసాగితే మంత్రి పదవి కోసం ఆలోచించనున్నట్లు కూడా హెచ్చరించారని తెలిసింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా మంత్రులు, నాయకులు మంగళవారం నిమ్మాడ చేరుకుని అప్పన్నకు భరోసా ఇచ్చేందుకు వ్యూహం రచించినట్లు తెలిసింది. అదే తరుణంలో రాజకీయ వ్యూహాన్ని అధిష్టానం మార్చినట్లు .. ఆ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆకస్మికంగా అచ్చెన్నాయుడును అరెస్టు చేసి .. గంటల వ్యవధిలోనే కోర్టులో హాజరు పరిచి .. రిమాండ్‌కు తరలించారు.
Also Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి మీ సంగతి చూస్తా : అచ్చెన్న
అప్పన్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి
నిమ్మాడలో పర్యటించాలని తొలుత నిర్ణయించిన విజయసాయిరెడ్డి .. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదని ఇంటిలిజెన్స్ నివేదకల ఆధారంగా తెలుసుకున్నారని, అందువల్ల ఆయన నిమ్మాడకు వెళ్లలేదని తెలిసింది. కానీ.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఇంట్లో ఉన్న అప్పన్నను విజయసాయిరెడ్డి పరామర్శించి వెనుదిరిగారని భోగట్టా. మొత్తానికి కింజరాపు కుటుంబంలో రాజకీయ ఆశలు ఉన్న కొంత మందిని బయటకు లాగి. కుటుంబంలో చిచ్చు పెట్టేసి.. అచ్చెన్నను టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కోటబొమ్మాళి, నిమ్మాడల్లో 144 సెక్షన్
ప్రస్తుతం నిమ్మాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంచాయతీ నామినేషన్ సమయంలో వైసీపీ అభ్యర్థి అప్పన్నపై హత్యాయత్నం చేశారన్న అభియోగంపై అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడితోపాటు మరో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడి సోదరుడు హరి ప్రసాద్, కుమారుడు సురేష్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ 1 కింజారపు హరిప్రసాద్, ఎ 2 కింజారపు సురేష్, ఎ 3 అచ్చెన్నాయుడు, ఎ 4 గా కింజారపు లలితకుమారి సహా 22 మందిపై కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ చేయగా.. ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని తొలుత టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడికి దగ్గరి బంధువైన కింజరాపు అప్పన్న వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించగా.. ఆయనను అడ్డుకున్నారనే ఆరోపణలతో అచ్చెన్న అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. కోటబొమ్మాళి, నిమ్మాడల్లో 144 సెక్షన్‌ను విధించారు. జిల్లాలో పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారమంతా ఒక రాజకీయ డ్రామాగా.. అధికార వైసీపీ ప్రభుత్వ ప్రతీకార చర్యలకు పరాకాష్టగా తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.కాగా, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని .. అంతా ఎన్నికల కమిషన్ కనుసన్నలలోనే జరుగుతోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read ;- ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు