మూడు సంవత్సరాల తరవాత వైసీపీ పార్టీ ఉండదని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల తరవాత ఆ పార్టీ ఉండదు. గ్యారంటీగా చెబుతున్నా, కావాలంటే రాసిపెట్టుకోండని విశాఖలో విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోతుందని కూడా తాను ముందే చెప్పానని ఆయన గుర్తుచేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి నేను కేఏ పాల్ ని కాదని కూడా విష్ణుకుమార్ రాజు సెటైర్ వేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై జనం విసిగివేసారిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్న పాలన అంత చెండాలంగా ఉందా?
ప్రతిపక్షంలో ఉండగా జనానికి జగన్ ముద్దులు పెడితే అది నిజమైన ప్రేమ అనుకున్నారని, కాని అది ఇప్పుడు కపట ప్రేమని తేలిందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎవరు ప్రశ్నించినా వారిని జైల్లో పెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి విశాఖలో అక్రమ కట్టడాలంటూ భవనాల కూల్చివేతలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తేనే, ప్రజలకు న్యాయం జరుగుతుందని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
Must Read: హైకోర్టు వ్యాఖ్యలు : ఏపీ సర్కారు ప్రస్థానం ఎటు వెళ్తున్నట్టు?
వైసీపీ నేతల ఆగడాలపై విశాఖ ప్రజల ఆందోళన
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖలో వైసీపీ అధికారంలోకి వచ్చాక భూముల కబ్జాలు ఎక్కువయ్యాయని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖలో స్థలాలను రక్షించుకునేందుకు జనం నానాపాట్లు పడాల్సి వస్తోందని, ఎవరు వచ్చి కబ్జా చేస్తారో అర్థం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనతో జనం విసిగిపోయారని, మూడేళ్ల తరవాత వైసీపీ అధికారంలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
Also Read: జగన్ కేసుల్లో నిమ్మగడ్డకు కొంత ఊరట