జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడం, నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఖరారు కావడం లాంటి ఎన్నికల హడావుడీతో గ్రేటర్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎవరికి వారు ఎన్నికల నేపథ్యంలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. రేపు నామినేష్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. నిన్న 20 అప్లికేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ రోజు భారీగా వచ్చే అవకాశం ఉంది.
డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. అయితే అధికార, విపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేందుకు ఎవరికి వారు ఎన్నికల వ్యూహాలను అములుచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. టీడీపీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో తలపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరువయ్యింది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇందులో తమ సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తెచ్చే పనిలో తెలంగాణ పార్టీ నాయకత్వం ఉన్నది. ఈక్రమంలోనే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఇక్కడి నేతలకు గ్రేటర్ ఎన్నికల అంశంపై ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మరోపక్క ఈ ఎన్నికలు టీడీపీకి పెద్ద సవాల్‌గా మారాయి.
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటే పార్టీకి పూర్వ వైభవం రావడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. ఇందుకుగానూ బాలకృష్ణను, నారా లోకేష్‌ను రంగంలోకి దింపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేపించాలా తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఆకర్షించాలంటే మామా అల్లుళ్లను ప్రచారంలో దింపడమే మంచిదనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు కొందరు బాలకృష్ణ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినారట. అయితే మామా అల్లుళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదో చూడాలి మరి.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 10 సీట్లేనట!!