టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీబీసీ ఛానెల్ నడుస్తోంది. ఈ భక్తి ఛానెల్ ప్రధాన వ్యాపకం ధర్మ ప్రచారం, తిరుమలేశుని కార్యక్రమాల ప్రచారం. ధర్మ ప్రచారం ముసుగులో ఎవరికి తోచినట్లుగా వారు కార్యక్రమాల రూపకల్పన చేసుకుంటూ.. ఆ పేరిట అడ్డగోలు దందాలు నడిపిస్తుండడం కూడా యథేచ్ఛగా జరుగుతూనే ఉంటుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే.. కొన్ని నెలల కిందట ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమితులైన సినీకమెడియన్ పృథ్వీ ఆ పదవిలో కూర్చుని సాగిస్తున్న రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వి సాగించిన శృంగార సంభాషణ లీకైంది. సహజంగానే ఇది నామీద జరిగిన కుట్ర, గట్రాగట్రా అంటూ పృథ్వీ బుకాయించే ప్రయత్నం చేశారు గానీ.. మొత్తానికి ఆయన పదవి పోయింది. ఖాళీ అయ్యారు. ఇటీవలే మరొకరి నియామకం కూడా జరిగింది.
వర్తమానంలోకి వస్తే.. ఎస్వీబీసీ ఛానెల్ లో కొందరు ఉద్యోగులు తాము పనిచేసే కంప్యూటర్లలో పోర్న్ సైట్లు చూస్తూ ఉన్నారనే సంగతి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి నలుగురు ఉద్యోగులను గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి గానీ, నిజానికి ఇలాంటి ఉద్యోగులు సుమారు 30 మందిని గుర్తించినట్లుగా తెలుస్తోంది.
AlsoRead ;- తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్లేసులో రాజావారు!
పోర్న్ బాగోతాలు బయటకొచ్చాయిలా..
తండ్రి చనిపోతే.. వారసులకు ఉద్యోగం ఇచ్చే కోటాలో ఓ వ్యక్తికి అటెండరు ఉద్యోగం వచ్చింది. అతను ఆఫీసులో ఉంటూ కంప్యూటర్లో పోర్న్ సైట్లు చూస్తుండగా.. దొరికిపోయారు. అతణ్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఆఫీసులో ఇలాంటి పనులు ఎందరు చేస్తున్నారో అని అనుమానించిన అధికారులు.. తత్సంబంధిత నిపుణుల్ని పిలిపించారు. నిపుణులు వచ్చి.. ప్రతి కంప్యూటర్లోనూ బ్రౌజర్లలో డిలిటెడ్ హిస్టరీని కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా రాబట్టారు. దీంతో వీడియో ఎడిటింగ్ జరిగే చాలా కంప్యూటర్లలో పోర్న్ సైట్లు చూస్తున్న సంగతి బయటపడింది. వారందరి కంప్యూటర్లలో ఇంకా క్షుణ్నంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎస్వీబీసీ చానెల్ లోని ఒక మహిళా ఉద్యోగి.. ఆఫీసు కంప్యూటర్ నుంచి ఆన్‌లైన్ లో సెక్స్ టాయ్స్ ఆర్డర్ చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు.
సాధారణంగా కంప్యూటర్ నాదే గానీ.. అవి చూసింది నేను కాదు అని బుకాయించడానికి కూడా ఆస్కారం ఉంటుంది గానీ.. ఎస్వీబీసీలో ప్రతి సిస్టమ్ లోనూ ఉద్యోగి వారి వ్యక్తిగత ఐడీతో లాగిన్ అయిన తర్వాతే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఎవరూ తప్పించుకోడానికి వీల్లేకుండా పోయింది. ఎవరెవరి లాగిన్ ఐడీలతో పోర్న్ సైట్లు చూశారో లెక్క తీసేసరికి దొంగలంతా దొరికిపోయారు.
చానెల్ ఉన్నతాధికారులు ఇంకా పూర్తిస్థాయి విచారణ చేయిస్తున్నారు. సుమారు 30 మంది వరకు ఇప్పటిదాకా లెక్కతేలగా.. ఎవరికి వారు తమ పేర్లు జాబితాలో లేకుండా చేసుకోడానికి పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
AlsoRead ;- వేంకటేశ్వరుడి పరువు, సొమ్ము పణంగా పెట్టేస్తారా?











