అజరామర ప్రేమకథలు బాక్సాఫీసును కొల్లగొట్టిన సందర్భాలు అనేకం. నాటి ‘మొగల్ ఏ ఆజమ్’ మొదలుకుని ‘దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే’ వరకూ సినిమాలకు ఎవర్ గ్రీన్ ప్రేమ కథలే అని నిరూపించాయి. ఇలాంటి ప్రేమ కథకు పునర్జన్మ అనే అంశాన్ని ముడిపెట్టి తెలుగులో ‘మూగమనసులు’ మొదలుకుని రేపటి నాని ‘శ్యామ్ సింగరాయ్’ వరకూ ప్రేక్షకుల మనసుని దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే సినిమానే ప్రభాస్, పూజా హెగ్డేల ‘రాధేశ్యామ్’ కూడా. ఈ సినిమా టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఈరోజు ఉదయం 9.18 గంటలకు విడుదలైంది.
ఈ టీజర్ కు సంబంధించి ముందే లీకులు వచ్చాయి. రొమాంటిక్ లవ్ అడ్వంచర్ సినిమాగా ఇది తెరకెక్కిందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ టీజర్ కోసం ఇటీవలే పూజా హెగ్డే డబ్బింగ్ చెబుతూ ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ నెల 14న టీజర్ విడుదలవుతుందంటూ, దాని కోసమే డబ్బింగ్ చెబుతున్నానంటూ కామెంట్ చేసింది. ఆమె అన్నట్టుగానే ఈరోజు టీజర్ గురించి అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమా గ్లింప్స్ గురించిన లీకులు కూడా నిజమయ్యాయి.
ఈ సినిమాలోని ప్రేమికులు ఇద్దరి మధ్యా జరిగే ప్రేమ సంభాషణతోనే టీజర్ ను కట్ చేశారు. యూరప్‌లో రైలు ఆగడం.. అక్కడ ప్రయాణికుల మధ్య నుంచి ప్రభాస్ ఎగురుతూ ఓ విదేశీ భాషలో తన ప్రేమను వ్యక్త పరుస్తూ డైలాగ్ చెప్పడంతో ఈ సినిమా గ్లింప్స్ ప్రారంభమైంది. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని ప్రేరణ ప్రశ్నిస్తే, దానికి విక్రమాదిత్య ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నీనా టైప్ కాదు’ అంటాడు. మనం చనిపోము అని హీరో నోటితో చెప్పించడాన్ని బట్టి చూస్తుంటే వీరి ప్రేమ ఫలించక మరణిస్తారా? అన్న అనుమానం కూడా వస్తోంది.
Must Read ;- ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ లీకులు
ఈ జంట రాధ, శ్యామ్ గా పుట్టి తమ ప్రేమను ఫలవంతం చేసుకునే కథాంశంగా జనం ఊహించుకుంటున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల తర్వాత వచ్చే ప్రభాస్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి ఈ రోజు విడుదలైన టీజర్ ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. మొత్తానికి ప్రభాస్ అభిమానులు మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. జులై 30న ఈ సినిమా విడుదల అవుతుందని ఈ టీజర్ లోనే ప్రకటించడం విశేషం. మొత్తానికి డార్లింగ్ అని అభిమానులు పెట్టిన పేరును ప్రభాస్ ఈ సినిమా ద్వార సార్థకం చేసుకుంటున్నాడేమో.











