పచ్చని అడవులు.. పచ్చిక బైళ్లు… అన్నెం పున్నెం ఎరుగని గిరిజనులు… ఆ ప్రశాంతత ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎప్పుడూ లేని హడావుడి.. ఎప్పుడూ రాని నేతలు… నిత్యం పోలీసుల బూటు చప్పుళ్లు… ఇదీ గుర్రంబోడు తండా పరిస్థితి! ఇప్పుడీ పేరు తెలంగాణ రాష్ట్రమంతా మార్మోగుతోంది. నిత్యం ఆహ్లాదంగా ఉండే అక్కడి నేల నెత్తుటితో తడుస్తోంది. రాజకీయ విమర్శలతో వేడెక్కుతోంది. ఇంతకీ గుర్రంబోడు తండా లొల్లేంటి? అక్కడి భూముల పంచాయితీ ఏంటి?
ఆ 450 ఎకరాల్లోనే వివాదం..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది. పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 540లో 6,239 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2,411.27 ఎకరాలు అటవీ భూమి కాగా.. 1,951 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగిలిన 1,876.01 ఎకరాలను 328 కుటుంబాలకు 1960లో సాగర్ నిర్వాసితులుగా గుర్తిస్తూ ప్రభుత్వం డీ- ఫాం పట్టాలిచ్చింది. ఈ భూముల్లోనే ఇక్కడి గుర్రంబోడు తండా, భోజ్య తండాల్లోని దాదాపు 500 కుటుంబాలు సేద్యం చేసుకుంటున్నాయి. వీరిలో చాలామందికి పాసుపుస్తకాలుండి, రైతు బంధు డబ్బులు సైతం అందుతున్నాయి. అయితే దాదాపు 450 ఎకరాలను తాము అన్ని ఆధారాలతో కొన్నామని ప్రైవేటు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ భూముల్లోనే వివాదం నడుస్తోంది. క్షేత్రస్థాయిలో 6 వేల ఎకరాలుంటే 12 వేల ఎకరాలకు పట్టాలిచ్చిన ఇద్దరు తహసీల్దార్లను గతేడాది ఆగస్టు 21న కలెక్టరు సస్పెండ్ చేశారు.
నాలుగు దశాబ్దాల క్రితమే..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కింద 40 ఏళ్ల క్రితం భూములిచ్చారు. దట్టమైన అడవి, సుదూర ప్రాంతం కావడంతో సుమారు 70 శాతం మంది నిర్వాసితులు ఈ భూముల్లోకి రాలేదు. కొందరు గిరిజనులు కొంతకాలంగా వాటిలోనే సేద్యం చేస్తున్నారు. అక్కడ గ్రానైట్ పుష్కలం. దీంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారుల సాయంతో ఆ కంపెనీలు పట్టాలు సృష్టించుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. అయితే… ఎన్నోఏళ్లుగా సాగులో ఉన్నామని, కాస్తులో సైతం తామే కొనసాగుతున్నామని… కావాలనే కొన్ని కంపెనీలు తమను తరిమేస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- తెలంగాణలో పెరిగిన భూ ఆక్రమణలు.. విచారణకు బీజేపీ డిమాండ్
సర్వేలో ఆసక్తికర విషయాలు..
గిరిజనుల ఫిర్యాదుతో కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. సర్వే నంబరు 540ని సమగ్రంగా సర్వే చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాగర్ నిర్వాసితుల భూములు 1,876 ఎకరాలున్నట్లు గుర్తించారు. ఈ భూముల్లో ఎక్కువ శాతం నిర్వాసితుల చేతిలో కాకుండా వివిధ కంపెనీలు, స్థానిక నాయకుల పేరిట ఉన్నట్లు వెల్లడైంది. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు బినామీ పేర్లతో 178 ఎకరాలకు పట్టాలు సృష్టించుకోగా మరో 246 ఎకరాల ప్రభుత్వ భూమిలో సిమెంటు కంపెనీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ‘ఇందులో పెద్దపెద్ద కంపెనీలు, పలువురు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఉండటంతో సర్వేను ఉన్నది ఉన్నట్లు బహిర్గతం చేస్తారన్న నమ్మకం లేదు…’ అని క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు అభిప్రాయపడ్డారు.
‘ప్రైవేటు’ కాపలాతో ఉద్రిక్తత..
వివాదాస్పద భూముల్లో జనవరి 13వ తేదీన ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు, మినరల్ గిల్డ్ కంపెనీ నిర్వాహకులకు మధ్య చోటు చేసుకుంటున్న ఆందోళనలు, రాజకీయ పార్టీల నేతల పర్యటనలతో భూముల వివాదం చర్చనీయాంశమైంది. మినరల్ గిల్డ్ యాజమాన్యం, ఆ భూముల వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులను కర్రలతో కాపలా ఉంచారు. రెవెన్యూ, పోలీస్ శాఖలకు సంబంధం లేకుండా కంపెనీ యాజమాన్యం సిబ్బందిని కాపలా పెట్టడంతో తమ భూములు దక్కకుండా పోతున్నాయనే ఆవేదనతో రైతులు ఏకమయ్యారు. భోజ్యతండా, భీమ్లాతండా, రామచంద్రాపురం, మీగడంపాడు, తుమ్మలతండా, గుర్రంబోడు తండా రైతులు.. కాపలా ఉన్న వారిని వెళ్లగొట్టేందుకు నిర్ణయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

బీజేపీ యాత్రతో పొలిటికల్ హీట్..
బీజేపీ చేపట్టిన గిరిజనుల భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివాదాస్పద భూములను భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నేతలు సందర్శించడానికి వచ్చినప్పుడు పరిస్థితులు లాఠీఛార్జి వరకూ వచ్చాయి. సంజయ్, ఎమ్మెల్యేలు రఘునందన్, రాజాసింగ్, పార్టీ నాయకురాలు విజయశాంతి బస్సులో గుర్రంబోడు వచ్చారు. ఈ తరుణంలో అక్కడ ఓ షెడ్డుపైకి బీజేపీ శ్రేణులు రాళ్లు విసిరారు. కర్రలతో షెడ్డు ధ్వంసానికి విఫలయత్నం చేశారు. ఆ రాళ్లు పోలీసు అధికారులకు తగిలాయి. కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు, కోదాడ టౌన్ ఎస్సై క్రాంతికుమార్‌ల తలలకు గాయాలై రక్తస్రావమైంది. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేశారు. కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ కేసులో పోలీసులు 21 మంది బీజేపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
భాజపాది గిరిజన వంచన యాత్ర: సైదిరెడ్డి
గుర్రంబోడు గిరిజనుల భూముల విషయంలో తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ చేశారు. నిరూపించలేకపోతే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భాజపా చేసింది గిరిజన భరోసా యాత్ర కాదని, గిరిజన వంచన యాత్ర అని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లతో కలిసి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారికి సర్వే నంబరు 540 వివాదంపై అవగాహనే లేదన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే పలుకుబడి ఉన్నవారికి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు.
అమాయకులపై థర్డ్ డిగ్రీనా.. ఐజీ అంతు చూస్తా: సంజయ్
తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాస, కాంగ్రెస్ నేతలు గుర్రంబోడు భూములను ఆక్రమిస్తూ.. తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగిగా ఉన్న ప్రభాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించి ఐపీఎస్‌లను అవమానించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభాకర్‌రావును తాము అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ప్రభాకర్‌రావు అక్రమాస్తుల చిట్టాను బయట పెడతామన్నారు. జైళ్లకు భయపడే పనే లేదని, జైళ్ల నుంచే తాము అధికారంలోకి వస్తామని తెలిపారు. తాను మరోసారి సూర్యాపేట జిల్లాకు వస్తానని.. దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. తెరాస ప్రభుత్వంపై తమ యుద్ధం ప్రారంభమైందని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
Must Read ;- ఎవరు? ఎందుకు?ఎవరిపై.. షర్మిల వదిలిన బాణంపై ఎన్నో ఈక్వేషన్‌లు!











