రెండో విడతలోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుకున్నారు. కృష్ణా జిల్లాలో ఏకంగా మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలపర్రులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి 800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామంలోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. విజయనగరం జిల్లాలో అయితే ఏకంగా వైసీపీ కన్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ గ్రామాలను కైవసం చేసుకున్నారు. రెండో విడత ఫలితాలతో టీడీపీ శ్రేణులు పలు జిల్లాల్లో సంబరాలు చేసుకున్నాయి.
వైసీపీకి ఎదురుగాలి..
ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు వైసీపీ నేతల్లో వణుకు తెప్పిస్తున్నాయి. బెదిరింపులు, దాడులతో ఏకగ్రీవాలు చేసుకోగా మిగిలిన గ్రామాల్లో రెండో విడత ఫలితాలు వచ్చేశాయి. 13 జిల్లాల్లో 2700 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకంగా 952 గ్రామాల్లో విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1368 గ్రామాల్లో గెలిచారు. జనసేన బలపరిచిన అభ్యర్థులు 8 గ్రామాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు 98 గ్రామాల్లో గెలిచి సత్తా చాటుకున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో టీడీపీ హవా కొనసాగింది. ఈ మూడు జిల్లాల్లోనే టీడీపీ బలపరిచిన 330 మంది సర్పంచ్ లుగా గెలిచారు. ఇక్కడ వైసీపీ బలపరిచిన వారు 333 మంది విజయం సాధించారు. ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 214 మంది టీడీపీ బలపరిచిన వారు గెలవగా, 224 మంది వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన జిల్లాల్లోనూ మూడో వంతుకుపైగా పంచాయతీలను టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. దీంతో వైసీపీ మంత్రుల్లో వణుకు మొదలైంది. స్థానిక ఎన్నికల తరవాత జరగనున్న క్యాబినెట్ పునర్వవస్థీకరణలో ఎవరి పదవి ఉంటుందో ఎవరి పదవి ఊడుతుందో అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి.
గుంటూరులో టీడీపీ హవా..
గుంటూరు జిల్లాలో వైసీపీ కన్నా టీడీపీ అభ్యర్థులు ఎక్కువ గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు 67 పంచాయతీలు గెలవగా, వైసీపీ బలపరిచిన వారు 60కే పరిమితం అయ్యారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ బలపరిచిన వారు 94, వైసీపీ బలపరిచినవారు 159 స్థానాలు దక్కించుకున్నారు. సీమ జిల్లాల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుకున్నారు. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 200 పైగా గ్రామాల్లో టీడీపీ బలపరిచిన వారు గెలుపొందారు. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. ఏకగ్రీవాలు పోగా వినుకొండతో 42 పంచాయతీలను టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఇక మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై పునరాలోచించాలని హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
త్వరలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్
ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగియనుంది. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు తెరలేవనుంది. సోమవారం మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. రేపు సాధ్యం కాకపోతే, 17వ తేదీ నోటిఫికేష్ విడుదల చేసే అవకాశం ఉంది. మిగిలిన స్థానిక ఎన్నికలన్నీ ఒకే విడత నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి విజ్ఙప్తి చేశారు. అయితే దీనిపై ఎన్నికల కమిషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేసి, ఆ తరవాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఫలితాలను విశ్లేషిస్తే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి తగులుతోందనే చెప్పాల్సి ఉంటుంది.
Must Read ;- ఎవరి లెక్కలు వారివి..గెలుచిన వారు మావారేనంటున్న పార్టీలు