ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలయ్యాక.. పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా అప్పుల బాట పడుతన్న జగన్ సర్కారు.. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ కేంద్రం ఆదుకోకుంటే రాష్ట్ర విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయయని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. సీఎం జగన్ రాసిన ఈ లేఖపై రాష్ట్రంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిగులు విద్యుత్ కలిగిన ఏపీని జగన్ ప్రభుత్వం విద్యుత్ కోతలు తప్పని రాష్ట్రంగా మార్చేసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తనదైన శైలిలో జనం ముందు పెట్టేశారు. ఈ మేరకు శనివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ జగన్ సర్కారు చేతగాని తనాన్ని బయటపెట్టారు.
అసత్యాలు, అర్ధ సత్యాలు..
సీఎం హోదాలో జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను ప్రస్తావించిన పయ్యావుల.. ఆ లేఖలో ఉన్నవన్నీ అబద్ధాలేనని తేల్చేశారు. ప్రధానికి రాసిన లేఖలోనూ అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే చెబుతారా? అని కూడా పయ్యావుల నిలదీశారు. ఈ సందర్భంగా పయ్యావుల ఏమన్నారంటే.. ‘‘ రాష్ట్రంలో విద్యు దుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని.. ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటివి పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాసి, ప్రధానిని కాపాడమంటున్నారు. ప్రభుత్వ చేతగానితనం, ముందుచూపులేని తనానికి ప్రధాని ఎలా స్పందిస్తారు? మిగులు విద్యుత్ లో ఉన్నరాష్ట్రం ఈ విధమైన స్థితికి రావడానికి, ఈ ప్రభుత్వానికి ముందుచూపులేనితనమే కారణం. రాయలసీమ పెద్ద లు సాధించుకున్న సీమ థర్మల్ పవర్ స్టేషన్ ను 50శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలానే వీటీపీఎస్ ను దిగజార్చింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో బొగ్గు సరఫరా ఎందుకు లేకుండా పోయింది? ఒక్కసారిగా థర్మల్ విద్యుదుత్పత్తి పెరిగిందా? ముందుచూపు లేకుండా, బొగ్గు ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది నిజం కాదా? హిందూజాలు, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు 6 నెలలు గా విద్యుదుత్పత్తి నిలిపేయడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు. దీనిపై పాలకు లు, అధికారులు ఏం సమాధానం చెబుతారు? రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి సంస్థలను నీరుగార్చేలా ప్రభుత్వ చర్యలున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల నుంచి ప్రభుత్వం ఎప్పుడైతే పవర్ కొనడం మానేసిందో, అప్పుడే సదరు సంస్థలు విద్యుత్ ఉత్పత్తి నిలిపేసి, విదేశాల నుంచి బొగ్గును కొనడం ఆపేశాయి. సదరు సంస్థల నిర్వాకంతో ప్రభుత్వానికి కను విప్పు కలిగి, ఇప్పుడు ఆదరబాదరాగా ప్రధానికి లేఖరాసింది’’ అని పయ్యావుల ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ట్రూ అప్ గుట్టు విప్పేశారుగా
ఇప్పటికే పలుమార్లు విద్యుత్ ధరలను పెంచేసిన జగన్ సర్కారు.. తాజాగా ట్రూ అప్ చార్జీలను వినియోగదారులపై మోపిన సంగతి తెలిసిందే. ఆ ట్రూ అప్ చార్జీల గుట్టేమిటో కూడా తాజాగా పయ్యావుల విప్పేశారు. ‘‘గతంలో చంద్రబాబునాయుడు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు అన్నీ తప్పని ఈ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. మరిప్పుడు ప్రధానికి రాసిన లేఖలో ఆనాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్లే తాము విద్యుత్ అందించలేకపోతున్నామన్నారు. 8వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉందన్నవారు. 10వేల మెగావాట్ల విద్యుత్ అదానీ సంస్థ నుంచి ఎందుకు కొనడానికి సిద్ధమవుతున్నారో కూడాప్రజలకు సమాధానంచెప్పాలి. విద్యుత్ రంగసంస్థల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిందో కూడా ప్రభుత్వమే చెప్పాలి. విద్యుత్ వినియోగదారులు బిల్లుల తాలూకా సొమ్ము చెల్లించడం ఆపేశారా? పైసాతో సహా వారి నుంచి వసూలు చేస్తున్నారు కదా. ఆ సొమ్మంతా ఏమవుతోంది? ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం వినియోగదారుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. అలాంట ప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎందుకునష్టమొస్తుంది? కొను గోలు చేస్తున్న విద్యుత్ తాలూకా సొమ్ముని కూడా ప్రభుత్వం సదరు సంస్థలకు చెల్లించడం లేదు. కనీసం 50శాతం సొమ్మునైనా విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం ఆ పని చేయలేదు. మరి అలాంటప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు నష్టాలు ఎందుకొస్తున్నాయో అధికారులు సమాధా నం చెప్పాలి. ప్రభుత్వం సదరు సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వనందునే అవి నష్టాల్లో ఉన్నాయి. ఆ భారాన్నికూడా ట్రూఅప్ ఛార్జీలపేరుతో ప్రజలపైనే మోపారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు చెల్లించనందున, దాదాపు రూ.20వేల కోట్లవరకు ప్రభుత్వం బకాయి ఉంది. ఈ విధంగా ప్రభుత్వం తనఅసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీలపేరుతోప్రజలపైనే వేసింది’’అని సంచలన వ్యాఖ్యలు చేసిన పయ్యావుల ట్రూ అప్ చార్జీల గుట్టును విప్పేశారు.
Must Read ;- జీవనాడి ప్రాణం పోయినట్టే