పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సినిమాలన్నీ విప్లవ పంథాలోనే సాగుతాయనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నారాయణమూర్తి రైతు సమస్యలపై దృష్టిపెట్టారు. రైతన్న పేరుతో ఆయన నిర్మిస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు ఎల్వీ ప్రసాద్ డిజిటల్ కలర్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ సినిమా తొలి కాపీ కూడా సిద్ధమైపోతుంది. మార్చి నెలలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి నారాయణ మూర్తి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి పలు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ కమిటీ చేసిన అమలు చేయాలని అందరూ కోరుతున్నారు. ఈ సిఫార్సులను పక్కనపెట్టి కొత్త వ్యవసాయి చట్టాలను తీసుకు రావడం మీద విమర్శన బాణంగా నారాయణమూర్తి ఈ సినిమాను రూపొందించారు. ఈ చట్టాలు రైతులకు వరాలు కావు శాపాలని చాటేలా ఈ సినిమా కథాంశం ఉంటుందట.
పంజాబ్ హర్యానా, బీహార్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దుచేయాలని పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్న అంశం మీదే నారాయణ మూర్తి దృష్టి పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా మీద నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో మన రైతాంగానికి కొత్త చట్టాలు మేలు చేస్తాయని కేంద్రం అంటుంది. సవరణలు చేస్తాం కానీ రద్దు మాత్రం చెయ్యం అని కూడా చెబుతోంది. ఈ సవరణలు వద్దు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు పోరాటం చేస్తున్నారు. ఒక కళా కారుడిగా నేను కేంద్ర ప్రభుత్వానికీ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.రైతులంటే మీకు ఎంతో గౌరవం అని చెప్పారు.
ఆ రైతుల పట్ల మీకు అంత గౌరవం ఉంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నా .ఎకరం భూమి దున్నడం రాని వారు, నాగేటి సాలల్లో రైతులు విత్తనాలు ఎలా చల్లుతున్నారో తెలియని వారు, బస్తా ధాన్యం పండించడం చేతకాని వారంతా రైతులతో చర్చించ కుండా ఈ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. అందుకే వీటిని రద్దు చేయమంటున్నాం. ఈ నేపథ్యంలో చేసిన సినిమానే మా రైతన్న’ అని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి రైతులపై భారంమోపే పనులు మానుకోవాలని కూడా ఆయన డిమాండు చేశారు.
Must Read ;- వ్యవసాయ చట్టాలపై ప్రజల్లోకి వెళ్లండి: మోడీ











