కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో అన్నదాతలు కొనసాగిస్తున్న నిరసనలు ఇప్పటికే రెండు నెలలు పూర్తి చేసుకోనున్నాయి. ఇలాంటి క్రమంలో ఉద్యమాన్ని అణచివేయడం ఎలాగో తెలియక తల పట్టుకున్న నరేంద్ర మోదీ సర్కారు… ఉద్యమకారులపై దొంగ దెబ్బ తీసిందన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిపోగా… ర్యాలీ అనంతరం ఏకంగా వంద మంది రైతులు అదృశ్యమైపోయారు. పంజాబ్‌కు చెందిన వీరంతా గడచిన నాలుగు రోజులుగా ఏమైపోయారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. అదే సమయంలో ఉద్యమకారులను నిలువరిస్తూ… శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు శనివారం నాడు ఏకంగా తమకు భద్రత లేదని ఏకంగా రోడ్డెక్కినంత పని చేశారు. ఈ రెండు ఘటనలను కాస్తంత పరికించి చూస్తే… రైతుల ఉద్యమాన్ని అణచివేసే దిశగా ఏదో కుయక్తులతో కూడిన ప్రణాళిక పక్కాగానే అమలు అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రైతుల ఉద్యమాన్ని విరమింపజేసే పనిలో భాగంగా..
అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్న కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని నినదిస్తున్న రైతులు… నెల రోజులకు పైగా ఢిల్లీని ముట్టడించి తమదైన శైలిలో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమాన్ని విరమింపజేసే పనిలో భాగంగా.. రైతు సంఘం నేతలతో కేంద్ర ప్రభుత్వం దఫదఫాలు చేపట్టిన చర్చలు ఏమాత్రం ఫలితాన్నివ్వలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లుగానే అన్నదాతలు గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింస అనంతరం గడచిన అయిదు రోజులుగా 100 మందికి పైగా రైతుల జాడ తెలియడంలేదంటూ పంజాబ్ మానవ హక్కుల సంస్థ శనివారం సంచలన ప్రకటన చేసింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులూ ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైందని ఆ సంస్థ తన రిపోర్టులో తెలిపింది. అదృశ్యమైన వారిలో ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే ఎక్కువగా ఉన్నారని వివరించింది.
Must Read ;- ‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ
అదృశ్యమైన వారి జాబితా ప్రకటిస్తామన్న బీకేయూ(రాజేవాల్)
ఇదిలా ఉంటే.. కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన జాబితాలు తమకు అందుతున్నట్లు బీకేయూ(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్ సింగ్ మరో కీలక ప్రకటన చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, ఖల్రా మిషన్, పంజాబ్ మానవ హక్కుల సంస్థ తెలిపాయి. 400 మందికి పైగా నిరసనకారులు పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారని సామాజిక ఉద్యమ కార్యకర్త సరాబ్జీత్ సింత్ వెర్కా ఆరోపించారు. వీరిలో కొందరిని తీహార్ జైలుకు తరలించినట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలువురిపై దేశద్రోహ కేసు కూడా నమోదు చేసింది. అయితే కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలను అందించాలని పలు సంఘాలకు చెందిన ప్రముఖులు నిర్ణయించారు. ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారి తరఫున ఉచితంగా వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.
పోలీసుల నిరసన స్వరం
ఆందోళన చేస్తున్న అన్నదాతల పరిస్థితి ఇలా ఉంటే… ఆందోళనల వేళ శాంతి భద్రతల పర్యవేక్షణే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు శనివారం ఊహించని విధంగా నిరసన స్వరం వినిపించారు. నిరసనల హోరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చూసే క్రమంలో తమకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని పోలీసులు నిరసన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ దినోత్సవాన జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో కొందరు నిరసన కారులు పోలీసులపైకి ఎలా తిరగబడ్డారో? ఖాకీలని కూడా చూడకుండా ఆందోళన కారులు కర్రలు చేతబట్టి ఏ రీతిన స్వైరవిహారం చేశారో తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు భద్రత లేదని స్వయంగా పోలీసులే నిరసన గళం వినిపిస్తున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ట్రాక్టర్ ర్యాలీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… ర్యాలీలోకి చొరబడి తమను బదనాం చేయడమే లక్ష్యంగా, తమ ఉద్యమాన్ని నీరుగార్చేలా హింసకు పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తుంటే… ఆ ఆరోపణలకు ఎంతమాత్రం విలువ ఇవ్వకుండా మోదీ సర్కారు రైతులపైనే కేసులు పెట్టడం చూస్తుంటే.. అన్నదాతల ఉద్యమాన్ని నిలువరించేందుకు ఓ పక్కా ప్రణాళిక ప్రకారమే పావులు కదులుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు