కార్తికేయ హీరోగా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాగా రూపొందిన ‘రాజా విక్రమార్క’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. 88 రామారెడ్డి, ఆదిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) నేపథ్యంలో ఈ కథ తెరకెక్కింది. విక్రమ్ (కార్తికేయ) ఈ సంస్థలో కొత్తగా చేరిన ఆఫీసర్. తన పై అధాకారి మహేంద్ర (తనికెళ్ల భరణి) ఆధ్వర్యంలో పనిచేసే బృందంలో విక్రమ్ ఉంటాడు. నేరం చేసిన తర్వాత కాకుండా నేరం చేయాలనే ఆలోచన దశలోనే ఎన్ఐఏ స్పందిస్తుందని ఓ డైలాగ్ తోనే దర్శకుడు ఈ సంస్థ పనితీరును చెప్పారు. హైదరాబాద్ లో అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న ఓ నల్లజాతీయుడిని ఈ ఎన్ఐఏ బృందం పట్టుకుంటుంది.
అతన్ని విచారించే సమయంలో పొరపాటున పిస్టల్ పేలి ఆ నిందితుడు మరణిస్తాడు. అయితే అతను చనిపోయే ముందు అతని నోటి నుంచి గురునారాయణ్ (పశుపతి) పేరు బయటికి వస్తుంది. అతని వల్ల హోంమత్రి చక్రవర్తి (సాయికుమార్)కు ప్రాణగండం ఉందని తెలుస్తుంది. అతన్ని రక్షించడానికి మహేంద్ర ఎలాంటి వ్యూహం పన్నాడు? దానికి విక్రమ్ ఎలా తోడ్పడ్డాడు అన్నదే ప్రధాన కథ.
హోమంత్రిని కాపాడే ప్రయత్నంలో అతని కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్)తో ప్రేమలో పడతాడు విక్రమ్. సాయికుమార్ ప్రాణాలను కాపాడటానికి విక్రమ్ ఏంచేశాడు? ఈ సినిమాలో గురుచరణ్ తో పాటు ఇంకెవరెవరు హోమంత్రిని అంతమొందించే ప్రయత్నంలో ఉన్నారు? వీరి ఆటను విక్రమ్ ఎలా కట్టించాడు అన్నదే ఈ సినిమా. దీన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత కార్తికేయ చాలా సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేయవచ్చనే అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్టుగానే భావించాలి. ఇలాంటి గూఢచారి కథలను వినోదాత్మకంగా చెబితే కథనం దారితప్పకుండా ఎలా ఉంటుంది. ఇలాంటి సీరియస్ కథను సిల్లీగా తీసేయాలనుకోవడం ప్రధానంగా చేసిన పొరపాటు. దర్శకుడు శ్రీ సరిపల్లి అక్కడే తప్పులో కాలేసినట్టు అనిపిస్తుంది. విక్రమ్ గా కార్తికేయ నటన బాగుంది. కాంతి పాత్రలో తాన్యా రవిచంద్రన్ కూడా అందంగా మెరిసింది. ఆమె మంచి క్లాసికల్ డ్యానర్ కూడా.
ప్రధమార్థంలో వినోదానికి పెద్ద పీట వేయాలని భావించినట్టుంది. ఆ కామెడీ కూడా పెద్దగా పండలేదు. ఈ కథ కోసం అల్లుకున్న సన్నివేశాలన్నీ సిల్లీగా అనిపిస్తాయి. హోమంత్రిని రక్షించటానికి హీరో చేసే ప్రయత్నాలు, హోమంత్రి కూతురిని ప్రేమలో పడేయటం, హోమంత్రి కూతురిని కిడ్నాప్ చేయడం.. ఇలాంటి అంశాలన్నీ తమాషాగా అనిపిస్తాయి. పకడ్బందీ స్క్రీన్ ప్లే లేకుండా సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లిన భావన కలుగుతుంది. గురునారాయణ్ గా పశుపతిని కూడా సరిగా వాడుకోలేదు.
జరగబోయే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల ఊహకు అందిపోతాయి. అలాగే సాయికుమార్ పాత్రను కూడా సరిగా ఎలివేట్ చేయలేదు. కనీసం సెకండాఫ్ లో కథను సీరియస్ గానే నడిపినా సన్నివేశాలను అల్లిన తీరు ఆసక్తికలిగించలేదు. ఏసీపీ గోవింద్ గా సుధాకర్ కోమాకుల పర్సనాలిటీ సరిపోలేదు. పైగా ఈ కథలో అతనిది కీలక పాత్ర కూడా. ఆ పాత్రలోనూ సీరియస్ నెస్ కనిపించలేదు. స్క్రిప్టులో ఉన్న లోపాలే ఈ కథను దారి తప్పించాయని అనవచ్చు. ప్రశాంత్ విహారి రీరికార్డింగ్ కూడా పేలవంగా ఉంది.
నటీనటులు: కార్తికేయ, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్షవర్ధన్, జబర్దస్త్ నవీన్ తదితరులు.
సాంకేతికవర్గం: కెమెరా: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సమర్పణ : ఆదిరెడ్డి టి
నిర్మాత: 88 రామారెడ్డి
దర్శకత్వం: శ్రీ సరిపల్లి
విడుదల తేదీ: 12-11-21
ఒక్క మాటలో: రాజా రిమార్కు
రేటింగ్: 2.25/5











